హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ‘పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవంటున్న సీఎం రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు ఎలా వెచ్చిస్తున్నారు.. మీ ప్రాధాన్యత దేనికి? పేద పిల్లలకు బుకెడు బువ్వ పెట్టడానికా? లక్షన్నర కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేయడానికా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నిలదీశారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టేందుకు ఏడు నెలల నుంచి మెస్ చార్జీలు చెల్లిస్తలేరని మండిపడ్డారు. ‘ఇవ్వాళ మీడియాలో చూస్తున్నం.. స్కూళ్లలో ఆడ పిల్లలకు టాయిలెట్స్ లేక వందల మంది లైన్లలో నిలబడుతున్నరు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘పేద పిల్లలకు టాయిలెట్స్ కట్టడం నీ ప్రాధాన్యతనా? లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతనా?’ అని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను కలిసేందుకు వెళ్లేముందు ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. ముందుగా మూసీలోకి మురుగునీరు రాకుండా చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే గోదావరి నీళ్లను మూసీలోకి తెస్తామని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు గోదావరి నీళ్లను మూసీలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. తాను సబితా ఇంద్రారెడ్డితో కలిసి గాంధీ దవాఖానకు వెళ్లి చూస్తే రోగులు మందుల్లేక అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో మందుల సరఫరా నిలిచిపోయిందని మండిపడ్డారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేశారని, డబ్బుల్లేక నిలిపేశామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది తుగ్లక్ ప్రభుత్వంగా, పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు.
ముందుగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తుకుగూడలో సోనియాగాంధీ ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలుపుకోవాలని హరీశ్ హితవు పలికారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్నవారి మెడ మీద కత్తి పెట్టి ఎందుకు మార్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. సుందరీకరణ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఫార్మాసిటీకి కేసీఆర్ 15 వేల ఎకరాల భూమిని సేకరిస్తే ఫార్మాసిటీని పకనబెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సాయంతో ఫోర్త్‌సిటీ నిర్మిస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. ‘మూసీ డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)కే రూ.1500 కోట్లట! ప్రపంచంలో ఎక్కడా వినలేదు’ అని ఎద్దేవా చేశారు. ఆ మొత్తం ఖర్చుచేసి పేద పిల్లలకు అన్నం పెట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మూసీలోకి మురుగునీరు రాకుండా 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు) నిర్మించిందని గుర్తుచేశారు.
తెలంగాణభవన్ నుంచి ఆదివారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను కలిసేందుకు హైదర్షాకోట్కు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అడ్డుకోబోయారు. బీఆర్ఎస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. అనంతరం పోలీసులు పక్కకు తప్పుకోవడంతో బీఆర్ఎస్ బృందం కాన్వాయ్ తెలంగాణభవన్ నుంచి బయలుదేరి వెళ్లింది.