హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో రేవంత్ సర్కారును నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. జూలై 4న నిరుద్యోగులు నిర్వహించే చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారును అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్, వివిధ జిల్లాల నుంచి శనివారం తెలంగాణభవన్‌కు వచ్చిన నిరుద్యోగ యువతతో హరీశ్ ముందుగా సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చేందుకు తమను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ, అగ్రనేతలు, రాష్ట్ర నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూలై 4న నిర్వహించే ‘హలో నిరుద్యోగి, చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తిచేశారు. వారి సమస్యలు విన్న అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. వి ద్యార్థులు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని భరోసా ఇచ్చారు.
95 శాతం స్థానికులకు దక్కేలా చేశాం
రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95 శాతం ఉద్యోగాలను స్థానికులకు వచ్చేలా నాటి కేసీఆర్ సర్కారు చేసిందని హరీశ్ గుర్తుచేశారు. లక్షా 62 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, వాటి పూర్తి వివరాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకున్నదని విమర్శించారు. రేవంత్ సర్కారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి చర్చ పెట్టకుండానే సభ వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవాచేశారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్‌లెస్ క్యాలెండర్ అని ఆ రోజు అంబేదర్ విగ్రహం వద్ద ధర్నా చేశామని, తెలంగాణ అమరుల స్తూపం ఎదుట కూర్చొని కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టామని గుర్తుచేశారు.
జాబ్ క్యాలెండర్‌లోని నోటిఫికేషన్లు ఇవ్వలే
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రటించినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అన్ని న్యూస్ పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి, అవసరం తీరాక తెప్ప తగలేసిన తీరుగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 2024, అక్టోబర్ 24న ఎస్పీడీసీఎల్, ఫారెస్ట్, గ్రూప్స్, డీఎస్సీ, పోలీసు ఇలా అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో ప్రకటించారని, ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ‘జాబ్ క్యాలెండ్ దగా క్యాలెండర్ అయింది.. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యింది’ అని మండిపడ్డారు. నోటిఫికేషన్లు వద్దు అని విద్యార్థులే ధర్నా చేస్తున్నట్టు రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని ఫైరయ్యారు.
యువతను మోసగించిన రేవంత్
‘ప్రియాంకగాంధీ సరూర్‌నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందిరాగాంధీ మనవరాలిగా మాటిస్తున్నా అని చెప్పారు. ఎకడున్నారు ప్రియాంకగాంధీ? ఏమైంది నోటిఫికేషన్లు? ఉద్యోగాలు? రేవంత్‌రెడ్డిని ఎం దుకు ప్రశ్నించరు? మీ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తున్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అడగరు? 5 అంశాల్లోని యూత్ డిక్లరేషన్‌లో ఒకటీ అమలు కాలేదు. అమరుల కుటుంబాలకు నె లకు 25 వేల పింఛన్ అన్నారు. 2లక్షల ఉద్యోగాలన్నారు, అమ్మాయిలకు సూటీలు ఇస్తమన్నారు, ఏమైంది?’ అని హరీశ్ నిలదీశారు.
మాట తప్పిన రాహుల్
రాహుల్‌గాంధీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగులకు ఇచ్చిన మాట కూడా తప్పారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2 లక్షల ఉద్యోగాలని సోనియా, రాహుల్, ప్రియాంకా అందరూ నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ‘75 శాతం ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్‌ను తెస్తామన్నరు. జీవో 29ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నియామకాల్లో దగా చేశారు’ అని నిప్పులు చెరిగారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్‌రెడ్డి గోబెల్స్‌ను మించి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆ ఉద్యోగాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు? ఎప్పుడు పరీక్ష పెట్టారు? ఎప్పుడు ఫలితాలు ఇచ్చారు? వంటి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నాడు కోదండరాం,బల్మూరి, మురళి రెచ్చగొట్టిండ్రు
కోదండరాం, బల్మూరి వెంకట్, ఆకునూరి మురళి, రియాజ్ అశోక్‌నగర్ వెళ్లి మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టారని హరీశ్ విమర్శించారు. విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు గానీ, రెచ్చగొట్టిన వారికే ఉద్యోగాలొచ్చాయని, ఇప్పుడు వారి వద్దకెళ్తే బెదిరిస్తున్నారని, భౌతికదాడులు చేస్తూ అక్రమ కేసు లు బనాయిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించినవారిపై దాడులు చేస్తారా? అని నిలదీశారు.
బకాయిలు ఎప్పుడిస్తరు?
రూ.3,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని హరీశ్ ప్రశ్నించారు. ‘బడా కాంట్రాక్టర్లకు రూ.12 వేల కోట్లు విడుదల చేసిండ్రు. పిల్లలు కమీషన్ ఇస్తలేరని ఫీజు బకాయిలు విడుదల చేస్తలేరా?’ అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాం లో 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామని, కరోనా వచ్చినా కేసీఆర్ ఆపలేదని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ‘హలో నిరుద్యోగి, చలో సెక్రటేరియట్’ పోస్టర్‌ను నిరుద్యోగులతో కలిసి హరీశ్ ఆవిషరించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకొని గద్దెనెక్కింది. బీఆర్ఎస్ తరపున మేము గట్టిగా ప్రశ్నిస్తే, రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండ్రు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిండ్రు. కానీ దానిపై చర్చ పెట్టకుండానే సభ వాయిదా వేసుకొని పారిపోయిండ్రు.
– హరీశ్
కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 16 వేల ఉద్యోగాలిచ్చినం. అందులో సగం కూడా కాంగ్రెస్ సర్కారు ఇస్తలేదు. ఏడాదిన్నరలో రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 12 వేలు దాటలేదు. యువతను దారుణంగా మోసం చేసిండ్రు. దొంగవు నువ్వు, అబద్ధాలాడింది నువ్వు.. పిల్లల మీద నెపం వేస్తున్నవు. నోటిఫికేషన్లు ఇవ్వ చేతగాక అబద్ధాలు మాట్లాడుతున్నవు. – హరీశ్
నిరుద్యోగులు భయపడకండి. మీరు పోరాడండి. మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉన్నది. మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తం. మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టం. – హరీశ్