రామచంద్రాపురం, ఏప్రిల్ 14: హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీలను తరలించాలనే ఆలోచన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో జరుగుతున్న బీరప్ప జాతరకు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టినప్పుడు చాలామంది అనేక అడ్డంకులు సృష్టించినా, మల్లన్నస్వామి దయతో ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్నసాగర్ నుంచే 15 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చి, ప్రజల గొంతు తడుపుతామని, మూసీనదిలో నీళ్లు పోసి అందులోని మురికిని శుద్ధి చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మల్లన్నస్వామి అంటే ఎంతో గౌరవమని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్నకు పట్టువస్ర్తాలు సమర్పించి, పట్నం వేసి వచ్చారని గుర్తుచేశారు. తాను జిల్లా మంత్రిగా పదేండ్లు మల్లన్నస్వామికి పట్టువస్ర్తాలు సమర్పించే ఆవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు.
తెల్లాపూర్‌లో బీరప్ప ఆలయం కోసం రూ.40 కోట్లు విలువ చేసే ఎకరం భూమిని కేటాయించామని, అందులో ఆలయం నిర్మించి పెద్ద ఎత్తున జాతర చేయడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేశం, పటాన్చెరు బీఆర్ఎస్ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మెట్టుకుమార్, సోమిరెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.