Congress Govt | (నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్): పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. శాంతియుత నిరసనలకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. సోమవారం తెలవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల నిర్బంధకాండ మొదలైంది. ప్రధానంగా బీఆర్ఎస్కు చెందిన చాలా మంది మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులను నిద్ర లేవకముందే అదుపులోకి తీసుకున్నారు.
పొలానికి వెళ్లిన వారిని, మార్నింగ్ వాక్కు వెళ్లిన వారిని జీపుల్లో ఎత్తుకొచ్చి ఠాణాల్లో కూర్చోబెట్టారు. లుంగీలు, నైట్ ప్యాంట్ల మీద ఉన్నారని కూడా చూడకుండా అక్రమంగా నిర్బంధించారు. బహిర్భూమికి వెళ్లనీయకుండా, మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే అడ్డు తగిలి మరీ అదుపులోకి తీసుకున్నారు. చాలా మందిని పోలీస్ స్టేషన్లకు తరలించగా మరికొంత మందిని గృహ నిర్భంధంలో ఉంచారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో 130 మంది మాజీ సర్పంచులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. మాజీ సర్పంచుల అరెస్టులతో హైదరాబాద్ మహానగరం ఆందోళనకరంగా మారింది.
తెలంగాణ సర్పంచుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చలో హైదరాబాద్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులు నగరానికి చేరుకున్నారు. చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తే బంజారాహిల్స్‌లో బస చేసిన తెలంగాణ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ముందస్తు సమాచారంతో అరెస్ట్ చేశారు. గ్రామాల్లో అభివృద్ది పనుల కోసం ఖర్చుచేసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికోసం వచ్చిన తెలంగాణ సర్పంచుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూధన్‌రెడ్డితో సహా 19మంది సర్పంచులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఓ హోటల్లో బసచేసి సోమవారం ఉదయం సీఎం నివాసానికి బయలుదేరారు. దీంతో అప్పటికే సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మాజీ సర్పంచులను కౌన్సిల్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి పరామ ర్శించారు. మాజీ సర్పంచులకు భరోసానిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు, పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లోనే బైఠాయించి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. 2019నుంచి 2024 దాకా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలను అద్బుతమైన రీతిలో తీర్చిదిద్దేందుకు సర్పంచులు కష్టపడ్డారని అన్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా ఇప్పటికీ పెండింగ్ బిల్లులు రాకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలి పారు. కాగా సీఎం ఇంటిముట్టడికి బయలుదేరిన సర్పంచులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
కంటోన్మెంట్, నవంబర్ 4: రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లను అరెస్టులు చేసి నిర్బంధించడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్‌లు చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. అర్ధరాత్రి దొంగలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్టు తీసుకెళ్లడం హేయమైన చర్య అని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ వద్ద ఆయన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ చైర్మన్లు గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్‌సాగర్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
సర్పంచ్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. అప్పులు చేసి, భార్యాపిల్లల మీదున్న బంగారం అమ్మి పనులు చేశామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అడిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు ఎంతో కృషి చేశారని హరీశ్‌రావు తెలిపారు.
ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకమని అన్నారు. మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారని.. కానీ పనులు చేసిన పాపానికి పేద సర్పంచులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. లక్షా 50వేల కోట్లతో మూసీని బాగు చేస్తానని అంటున్నావు. కానీ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదని అన్నారు. మాజీ సర్పంచులు నాలుగైదు సార్లు హైదరాబాద్‌కు వచ్చి మొర పెట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి సర్పంచులను చర్చలకు పిలవాలని.. పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.