సిద్దిపేట, సెప్టెంబర్ 30( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy) పర్సంటేజ్లకు భయపడి టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు భయపడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)పేర్కొన్నారు. పైసలు లేవంటూనే మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తరలించేందుకు రూ. 7 వేల కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీకి మూటలు కట్టేందుకు, కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకునేందుకు, బీహార్ ఎన్నికలకు పంపేందుకు ఉన్న పైసలు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసేందుకు లేవా? అని ప్రశ్నించారు. మంగళవారం సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
రేవంత్‌రెడ్డి ఊరూరా బెల్టుషాపులు, మైక్రో బ్రూవరీలు పెట్టి రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేల రైతుబంధు, ప్రతి మహిళకు రూ. 55 వేలు బాకీ పడినట్టు చెప్పా రు. కాంగ్రెస్ పార్టీ మోసాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని పేర్కొన్నారు. రైతుబంధు కింద తాము రూ 15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి పోయిన వానకాలం మొత్తానికే ఎగ్గొట్టారని, యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని రూ. 12వేలు ఇచ్చారని పేర్కొన్నారు. కౌలు రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో సీలింగ్ ఉందని, 54ఎకరాల కంటే ఎవరికీ ఎక్కువ భూమి లేదని వివరించారు. 25 ఎకరాలు ఉన్నవారు మూడు శాతం మాత్రమేనని పేర్కొన్నారు. రూ. 4 వేల పెన్షన్ ఈ రోజుకూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డివి గజనీకాంత్ మాటలు
రేవంత్‌రెడ్డివి గజనీకాంత్ మాటలని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికీ పంచారని, వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీలు 700 రోజులైనా ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అందుకే ఈ బాకీకార్డు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మాట్లాడితే మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారని, ఎవరైనా అయ్యారా? అని ప్రశ్నించారు. మహాలక్ష్మి కింద ఇస్తామన్న రూ. 2,500, తులం బంగారం ఏమైందని నిలదీశారు.
భరోసా కార్డులు ఒక్కరికైనా ఇచ్చారా?
విద్యార్థులకు ఇస్తామన్న రూ. 5లక్షల భరోసా కార్డు ఒక్కరికైనా ఇచ్చారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు అన్నారని, కనీసం 5 వేల ఉద్యోగాలైనా ఇచ్చావా? అని రేవంత్‌రెడ్డిని నిలదీశారు. నిరుద్యోగ భృతి కింద రూ. 4 వేలు ఇస్తామని హుస్నాబాద్‌లో ప్రియాంకగాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మార్పుమార్పు అని నమ్మించి ఏమార్చి రేవంత్‌రెడ్డి ప్రజల గొంతు కోశారని విమర్శించారు. 9 ఏండ్లలో కేసీఆర్ రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారని, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. కండ్లుండీ చూడలేని కబోదులు కాంగ్రెస్ పార్టీ నాయకులని మండిపడ్డారు.
బ్రేక్‌ఫాస్ట్ బంద్ పెట్టిందెవరు?
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు పొద్దున్నే టిఫిన్ పెడుతున్నదని రేవంత్‌రెడ్డి పొగిడారని, మరి కేసీఆర్ ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అధికారంలోకి వచ్చాక బంద్పెట్టింది ఎవరని హరీశ్‌రావు ప్రశ్నించారు. గ్రీన్ చానల్‌పెట్టి హాస్టళ్లకి నిధులు విడుదల చేస్తానన్నారని, కానీ కనీసం తిండిపెట్టే పరిస్థితే లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్యూచర్ సిటీకి ఆరు లేన్ల రోడ్డ వేస్తారట కానీ, ఉన్న రోడ్లును మాత్రం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.