హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ‘అసలైన తెలంగాణ ద్రోహివి, తెలంగాణ నీటి ద్రోహివీ నువ్వే రేవంత్‌రెడ్డి’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టానికి ఒక ముఖ్యమంత్రిని అనే విషయం మరచిన రేవంత్‌రెడ్డి.. వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. అధికారికంగా రేట్లు పెట్టి మరీ అవినీతిని పెంచి పోషిస్తున్న రేవంత్‌రెడ్డికి తమ గురించి మాట్లాడే నైతికహకు లేదని విమర్శించారు. శుక్రవారం గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. ‘మూసీపై చర్చకు మేము సిద్ధం. షార్ట్ డిసషన్ పెట్టండి, రోజంతా చర్చిద్దాం. కానీ, క్వశ్చన్ అవర్‌లో సీఎం గంటన్నర సేపు అడ్డగోలుగా మాట్లాడితే ఎలా?’ అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు మల్లన్నసాగర్ నుంచి తెస్తున్నారా? అన్న తమ ప్రశ్నకు సమాధానమే చెప్పలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళనలో ఇండ్ల్లు కోల్పోయిన పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరామని, వీటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.
‘మూసీ’పై శ్వేతపత్రం విడుదల చేయాలి
పిల్లలకు స్కాలర్షిప్లు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఖజానాలో పైసలు లేవని చెప్తున్న ప్రభుత్వం, మరీ మూసీ సుందరీకరణకు లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని నిలదీశారు. ‘ఈ ప్రాజెక్టులో భాగంగా ఎన్ని నివాసాలు కూల్చా రు? నిర్వాసితులకు చ ట్టం ప్రకారం పరిహారం ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. .
బుల్డోజర్లను అడ్డుకుంటం
మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూలగొట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంపడుకొనైనా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ముసుగులో పేదల నివాసాలను కూల్చితే ఊరుకోబోమని హెచ్చరించారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు పెడుతున్న ఖర్చు అంచనాలు, నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి రూ.లక్ష కోట్లు అని, మరోసారి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలి.
– హరీశ్‌రావు
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి పంపింగ్ చేసేందుకు గోదావరి జలాలను ఎక్కడి నుంచి రప్పిస్తారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనా మల్లన్నసాగర్ నుంచే కదా? లేదంటే ఎక్కడి నుంచైనా గాలిలో నుంచి తెస్తున్నారా? 2.5 టీఎంసీల తరలింపుపై స్పష్టతనివ్వాలి. – హరీశ్‌రావు