హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తేతెలంగాణ) : నాడు ఓట్ల కోసం అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు, నేడు అలవోకగా అబద్ధాలు చెప్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హామీల అమల్లో విఫలమైన సర్కారు ఎంచుకున్న రాచమర్గం ఇదేనని, ఈ విషయంలో అధికార పార్టీ నాయకులందరిదీ అదే దారి అని మంగళవారం ఎక్స్ వేదికగా ఎద్దేవాచేశారు. మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మొన్న మంచిర్యాల సభలో మంచినీళ్లు తాగినంత సులువుగా అబద్ధాలు చెప్పారని ఉదహరించారు. ‘అసత్యాలు చెప్పడం, మోసం చేయడం కాంగ్రెస్‌కే చెల్లింది. రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తున్నది నిజమే అయితే సంబంధిత జీవోను బయటపెట్టు’ అని డిమాండ్ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి నిరుడు నవంబర్ 19న వరంగల్‌లో, మళ్లీ అవే చెక్కులను ఈ యేడు మార్చి 8న హైదరాబాద్‌లో ఇందిరా మహిళా శక్తి సభల్లో మహిళలకు ఇచ్చిన చెక్కులు ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
వెంటనే ఈ చెక్కులను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ‘స్కూల్ యూనిఫాంల కుట్టుకూలి విషయంలో రూ.50 ఇచ్చి రూ.75 చొప్పున ఇస్తున్నామని ప్రచారం చేసుకున్నరు. మేం నిలదీసిన తర్వాత రూ.25 వేలు విడుదల చేశారు. ఈ నగదును వెంటనే చెల్లించాలి’ అని కోరారు. స్కూల్ డ్రెస్‌లు కుట్టేందుకు విద్యార్థులు వెళ్లి కొలతలు ఇవ్వాలని షరతు విధించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం ఇచ్చే రూ.75 కుట్టుకూలి ఏ మూలకూ సరిపోదని, రూ.150 చొప్పున ఇవ్వాలని సూచించారు. మహిళా సంఘాలకు రుణాలిచ్చే స్త్రీనిధి అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. మొత్తం లోన్లల్లో 40 శాతం నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్స్ ఉండటం వల్ల ఈ స్కీం మనుగడ ప్రశ్నార్థకమైందని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారికి బాధ్యతలిచ్చి స్తైనిధి స్కీంను కాపాడాలని కోరారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని కోతలు కోసిన రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర ఇందిరమ్మ పాలనలో ఎడతెగని వంచన చేశారని నిప్పులు చెరిగారు. కోటీశ్వరులేమోగాని, లక్షాధికారులను కూడా చేయడం చేతగాని సర్కారు ఇదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రచార యావను పక్కన బెట్టి మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మహిళలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వం గతంలో మాదిరిగానే రూ.5 లక్షల వరకే వడ్డీలేని రుణాలిస్తున్నది వాస్తవం కాదా? నిజంతెలిసీ భట్టి విక్రమార్క అబద్ధాలెందుకు చెప్తున్నరు? అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు జీవో 29 ప్రకారం రూ.5 లక్షలేనని చెప్పింది వాస్తవం కాదా? రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తున్నది నిజమే అయితే ఆ జీవో బయటపెట్టు! లేదంటే అటు అసెంబ్లీలో, ఇటు బహిరంగసభల్లో అసత్యాలు చెప్పి మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పు.
-హరీశ్‌రావు
ఉపాధి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలు, సీవోలకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఉపాధిహామీ పథకానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తున్నదని హరీశ్ ధ్వజమెత్తారు. వేతనాలందక వారు పస్తులుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మంత్రులు, అధికారులను కలిసి గోడువెళ్లబోసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని వారంతా ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. వారి వేతనాల చెల్లింపులోనూ సీఎం, మంత్రులు తలోమాట చెప్తున్నారని ఆక్షేపించారు.
వేతనాలు పెండింగ్‌లో పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని నిస్సిగ్గుగా చెప్తున్న రేవంత్‌రెడ్డి..ఉపాధి కూలీల నగదును ఎవరి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నాడు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఊదరగొట్టి ఇప్పుడు ఉన్న నౌకర్లను ఊడగొట్టేందుకు సిద్ధమయ్యారని దెప్పిపొడిచారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.