హుజూరాబాద్, అక్టోబర్ 12 : హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ గుబాలిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పొనగంటి శ్రావణ్కుమార్సహా పలు మండలాలకు చెందిన 300 మంది కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని మంత్రి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో దగ్గు శ్రీనివాసరావు, రాంపెల్లి సతీశ్, మోతె అశోక్, రమేష్‌రెడ్డి, రావుల రవి, వడ్లూరి ప్రసాద్ తదితర సీపీఐ కార్యకర్తలున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరానని పొనగంటి శ్రావణ్‌కుమార్ తెలిపారు. హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామస్థులు పలువురు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.