Harish Rao | కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్, ఆఫ్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్స్ పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? లేక కావాలనే చేస్తున్న కుట్రనా? అని నిలదీశారు.
భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవి, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని మండిపడ్డారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని తెలిపారు. మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.

Harish Rao Leter1

Harish Rao Leter2