మెదక్ : మెదక్ జిల్లా నర్సాపూర్(Narsapur) ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు బయల్దేరారు. కాగా, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (MLA Sunitha Lakshma Reddy) నివాసంపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డుపెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు పటాకులు కాల్చారు.
అయితే ఆ ఇంట్లో ఉంటున్న మనిదీప్ గౌడ్ అనే యువకుడు ఇదేంటని అడిగితే.. అతనిపై దాడిచేశారు. అంతటితో ఆగకుండా ఇంటిపైకి ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిపంద చర్య బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.