హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వేనంబర్ 613 (119) కాసుబాగ్ కంచెలో వేల కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల భూములను రియల్ మాఫియా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కబ్జాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా దాడులు, పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ నాదర్గుల్ గ్రామానికి చెందిన వందల మంది రైతులు బుధవారం హరీశ్‌రావును కలిశారు. కబ్జాదారులు వేసిన కంచెలు, ధ్వంసమైన తమ వ్యవసాయ బోర్లు, దాడుల్లో గాయపడిన ఫొటోలు, వీడియోలను హరీశ్‌రావుకు చూపించి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
రైతుల సమస్యలు విన్న హరీశ్‌రావు వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి, కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నాదర్గుల్ భూములు అన్యాక్రాంతం కాకుండా గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్టు కింద హైకోర్టు వరకు న్యాయపోరాటం చేసిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములను ధారాదత్తం చేసే క్రుట జరుగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసమే హైడ్రా తీసుకువచ్చామని గొప్పలు చెప్తున్న ముఖ్యమంత్రి నాదర్గుల్లోని వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్ ఎస్టేట్ రాబంధులు కబ్జా చేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారని ప్రశ్నించారు.
రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హరీశ్‌రావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ సజ్జనార్, స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వ సీలింగ్ భూములకు కలెక్టర్, ఆర్డీవోలే కస్టోడియన్లుగా ఉంటారని, అది ప్రభుత్వ భూమి అని మీరే సుప్రీంకోర్టుకు చెప్పారని, మరి అందులో ప్రైవేటు వాళ్లు కంచెలు వేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే ఆ కంచెలు తొలగించి, తాతలకాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మళ్లీ సాగు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానికులపై దాడి చేసిన కబ్జాదారులైన రౌడీలపై వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో తానే స్వయంగా బీఆర్ఎస్ పార్టీ బృందంతో నాదర్గుల్ భూముల్ని సందర్శిస్తానని అధికారులకు తేల్చి చెప్పారు.