హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో డబ్బాకొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాపీడనగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజావాణిలో పరిష్కరించకుండా తిరస్కరించిన దరఖాస్తులు ఎక్కువ అని విమర్శించారు. ప్రజావాణి అసలు బండారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన బట్టబయలు చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పి నిర్వహించకపోగా దానిని ప్రజావాణిగా పేరుమార్చారని తెలిపారు. కానీ అది ప్రజాపీడనగా మారిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం ఒకే ఒకరోజు హాజరై 10 నిమిషాల పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారని గుర్తుచేశారు. దీన్నిబట్టే ప్రజాదర్బార్ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైందని అన్నారు. కనీసం మంత్రులైనా ఉంటారని ఆశించిన జనానికి నిరాశే ఎదురవుతున్నదని చెప్పారు. మంత్రులకు గాంధీభవన్‌కు వెళ్లేందుకు ఉన్న తీరిక ప్రజావాణికి రావడానికి మాత్రం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రజావాణిని నామమాత్రంగా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతినిత్యం నిర్వహిస్తామని ఊదరగొట్టి ఇప్పుడు వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆ రెండు రోజులు ఎన్నో వ్యయప్రయాసలకు, దూరాభారాలకు ఓర్చి దరఖాస్తులు అందిస్తే.. అది వృథాప్రయాసగా మిగిలిపోతున్నదని ఫిర్యాదుదారులు వాపోతున్నారని తెలిపారు.
ప్రజావాణి ప్రారంభించినప్పటి నుంచి గతనెల (డిసెంబర్) 9వ తేదీ నాటికి వచ్చిన 82,955 పిటిషన్లలో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ (పరిష్కరించదగిన సమస్యలు) కిందకు వస్తాయని అధికారులు చెప్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్యాయం, హకులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు తమ విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసిన సదుపాయాలు అందకపోవడం వంటివాటినే తాము గ్రీవెన్సెస్గా పరిగణిస్తామని అధికారులే ధ్రువపరుస్తున్నారని (సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారం ఆధారంగా) ఆయన ఉదహరించారు. అంటే భూ తగాదాలు, భూ నిర్వాసితుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, పేదరిక సంబంధ సమస్యలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు మొదలైనవి గ్రీవెన్సెస్ కిందకు రావని సగం కన్నా ఎక్కువ దరఖాస్తులను తిరస్కరించిన విషయాన్ని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు.
ప్రజావాణి ప్రహసనంగా మారిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణికి వచ్చిన మొత్తం 82,955 పిటిషన్లలో గ్రీవెన్సెస్గా గుర్తించినవి కేవలం 43,272 మాత్రమేనని తెలిపారు. వీటిలో 27,215 పరిష్కరించామని అధికారులు చెబుతున్నదాంట్లో ఎంతమాత్రం నిజంలేదని అన్నారు. క్షేత్రస్థాయిలో తమకు ఉన్న స్పష్టమైన సమాచారం ప్రకారం .. అనేక అంశాలకు సంబంధించిన సమస్యలను పరిషరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని తెలిపారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిషారమవుతాయని ఎంతో ఆశతో వ్యయప్రయాసలకు ఓర్చి హైదరాబాద్ దాకా వచ్చిన వారి ఆశలు అడియాసలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొండంత ఆశలు రేపి, గోరంత కూడా న్యాయం చేయని దైన్యం నెలకొన్నదని మండిపడ్డారు.