హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి మంజూరైన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (నరేగా) పని దినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 2024-25 సంవత్సరంలో 12.22 కోట్ల పని దినాలు మంజూరు చేయగా, ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేసిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి 42సార్లు చక్కర్లు కొట్టినా తెలంగాణకు సాధించింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నదని మండిపడ్డారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
4 నెలలుగా నిలిచిన వేతనం
ఉపాధి హమీ కూలీలకు 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరో వైపు కేంద్ర ప్రభుత్వం కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నరేగా పని దినాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన నాలుగు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున ఆయన డిమాండ్ చేశారు.