జయశంకర్ భూపాలపల్లి, మే 23(నమస్తే తెలంగాణ)/కొడిమ్యాల: రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. వడ్లకు బోనస్ అడిగితే మొరుగుతున్నారంటూ కాంగ్రెస్ మంత్రి రైతులను కుక్కలతో పోల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సన్నాలతోపాటు దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొని రైతులకు రూ.500 బోనస్ ఇచ్చేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.
గురువారం ఆయన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్య విక్రయించేందుకు వచ్చిన రైతులతో హరీశ్‌రావు మాట్లాడారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ బాండు పేపర్లు రాసిచ్చారని, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామంటూ రైతులకు సెల్‌ఫోన్ మెసేజ్‌లు పెట్టారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక రైతుల గుండెల మీద తన్నుతున్నది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బోనస్ గురించి మాట్లాడకుండా, ఓట్ల డబ్బాలకు సీల్ వేసిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చి సన్నాలకే బోనస్ అంటూ కొర్రీలు పెడుతున్నదని ధ్వజమెత్తారు.
జగిత్యాల జిల్లాలో యాసంగిలో 3,00,723 ఎకరాల్లో వరి పంట వేశారని, ఇందులో దొడ్డు వడ్లు 3 లక్షల 73 ఎకరాల్లో వేస్తే.. 650 ఎకరాల్లో మాత్రమే సన్న వడ్లు పండించారని చెప్పారు. 99% మంది రైతులు దొడ్డు వడ్లు పండించగా, 0.6% మాత్రమే సన్న వడ్లు సాగు చేశారని తెలిపారు. రైతులు సన్న వడ్లను ఇంటి అవసరాలకు మాత్రమే పండిస్తారని, కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకునేంత పండించరని తెలిపారు. సన్న వడ్లు బయట అమ్ముకుంటే క్వింటాకు రూ.2,800 నుంచి రూ.3,000 వరకు వస్తున్నదని, ఇది ప్రభుత్వం ఇచ్చే బోనస్ కంటే ఎక్కువేనని రైతులు చెప్తున్నారని తెలిపారు.
ఎకరం భూమిలో దొడ్డు రకం 27 క్వింటాళ్ల వరకు పండితే, సన్న రకం 15 క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తున్నదని వివరించారు. సన్న రకంలో పంట దిగుబడి దాదాపు 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు తక్కువగా వస్తున్నదని చెప్పారు. సన్నాలకు రోగాలు ఎక్కువగా సోకడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతున్నదని, కాలపరిమితి కూడా నెల ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలోని రైతుల్లో 90% మంది దొడ్డు వడ్లు పండిస్తారని తెలిపారు. 100 రోజుల్లో రైతులకు రూ.500 బోనస్, రైతుభరోసా ఎకరానికి రూ.15,000, రూ.2 లక్షల రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ధాన్యం కొనడం కూడా ప్రభుత్వానికి చేత కావడం లేదని మండిపడ్డారు.
గత యాసంగిలో కేసీఆర్ ప్రభుత్వం 67 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 37 లక్షల టన్నులకు మించి కొనలేదని చెప్పారు. దీంతో రైతులు ప్రైవేట్‌కు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక మంత్రేమో రైతుబంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారని, మరో మంత్రేమో రూ.500 బోనస్ గురించి ప్రశ్నిస్తే..
‘మొరుగుతున్నారంటూ’ రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు హైదరాబాద్‌లో ఏసీల్లో కూర్చోవడం కాదని, కొనుగోలు కేంద్రాల్లో తిరుగుతూ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా త్వరగా తూకం వేసేలా చూడాలని హితవు చెప్పారు. రైతులకు భయపడి మంత్రులు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు.
గోడు వెళ్లబోసుకున్న రైతులు
కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్‌రావుతో అక్కడ ఉన్న రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 15 రోజులుగా సుమారు 20 లారీలకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఉన్నదని రైతులు వాపోయారు. పొద్దంతా ఎండబోస్తున్నామని, రాత్రి వచ్చే వానకు మళ్లీ తడుస్తున్నదంటూ తమ కష్టాలు చెప్పుకున్నారు. తేమ శాతం 16, 17 ఉండాలని అధికారులు చెప్తున్నారని, రోజూ వర్షాలు పడి తడుస్తుంటే అది ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తంచేశారు.
నాయకులు, అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. వర్షాలకు పక్కనే ఉన్న చెరువులోకి ధాన్యం కొట్టుకుపోయేలా ఉన్నదని, కనీసం కటింగ్‌తో తీసుకోమని కోరినా వినేవారు లేరని ఆక్రందించారు. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం తెచ్చిన మూడు రోజుల్లోనే కొనుగోలు చేసేదని గుర్తుచేసుకున్నారు. వెంటనే హరీశ్‌రావు జాయింట్ కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ‘ప్రతి గింజా కొంటాం.. తడిసిన ధాన్యం కొంటాం’ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరి కమలాపూర్‌లో పరిస్థితి ఏమిటి? 20 రోజులుగా వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదు?’ అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని కోరారు.
సన్నాలు పండిస్తే అప్పులే
కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో హరీశ్‌రావు కొద్దిసేపు సంభాషించారు. ఈ సందర్భంగా ఒక్కో రైతు తన బాధను హరీశ్‌రావుకు చెప్పుకున్నారు. ప్రభుత్వం సన్నాలకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తుందట.. మీరేమంటారు? అని హరీశ్‌రావు రైతులను అడుగగా.. ‘సన్నాలు తిండికి మాత్రమే పండిస్తాం. సన్నాలకు పెట్టే పెట్టుబడి గవర్నమెంట్ ఇస్తుందా? సన్నాలు మాకు గిట్టుబాటు కాదు. సన్నాలు పండిస్తే అప్పులపాలే. వాళ్లు బోనస్ ఇవ్వకున్నా బాధలేదు. మా ధాన్యం కొంటే అదే పదివేలు’ అంటూ రైతులు ముక్తకంఠంతో జవాబిచ్చారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సన్నాలకు మాత్రమే బోనస్ అంటే వడ్లలో రాళ్లు ఏరేసినట్టుగా కాంగ్రెస్‌ను ఏరేసేవారని అన్నారు. జూన్‌లోనే రైతులకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పచ్చిరొట్ట అందించే పరిస్థితితో ప్రభుత్వం లేదని మండిపడ్డారు. గుండెజబ్బుతో ఉండి 20 రోజులుగా కేంద్రం వద్ద ధాన్యాన్ని కాపాడుకుంటున్న మల్లికాంబ అనే మహిళా రైతు పరిస్థితి విని ‘నా హృదయం ద్రవీభవించిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
కొండగట్టులో పూజలు
మల్యాల, మే 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక ముడుపుకట్టిన హరీశ్‌రావు తాను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆలయ ప్రాకార మండపంలో ప్రత్యేక పూజలు చేసి, ముడుపును విప్పారు. అనంతరం ప్రధాన ఆలయంలోని ఆంజనేయస్వామివారిని, ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వరస్వామి, లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు.
మల్లికాంబ కంటతడి
కమలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్‌రావు ఎదుట అక్కడే ఉన్న గాజె మల్లికాంబ అనే మహిళా రైతు కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘మూడు ఎకరాల్లో దొడ్డు రకం వేశాను. 20 రోజులుగా ఐకేపీలోనే ఉంటున్నాం. వడ్లు కొనేటోళ్లు లేరు’ అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ‘వర్షానికి తడిసిన వడ్లను ఎండబోసేలోపే వర్షం వచ్చి మళ్లీ తడిసి పోతున్నది. ఇప్పటికే సగం వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. నాకు గుండె జబ్బు ఉన్నది. అయినా ఎండ, వానకు ఇక్కడ పడి వడ్లను చూసుకుంటన్న. రాత్రి అయితే ఇక్కడ కరెంటు ఉండదు.
గాలి వానకు ఎన్ని పరదాలు కప్పినా లాభం ఉంటలేదు. మొత్తం వడ్లన్నీ తడిసినయ్. తేమ పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతర్రు. గిట్ల వర్షం కొడితే తేమ ఎక్కడుంటది సారూ. దయచేసి నాకు న్యాయం చేయండి సారూ’ అంటూ ఆమె హరీశ్‌రావు చేతులు పట్టుకున్నది. ‘కలెక్టర్‌తో మాట్లాడుతా. తప్పకుండా నీ వడ్లు కొనేలా చేస్తా’ అని ఈ సందర్భంగా హరీశ్‌రావు ఆమెకు అభయమిచ్చారు.