Harish Rao | సిద్దిపేట, నవంబర్ 6: రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని, రాబందుల సర్కార్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నయ్, చేతలు గడపే దాటడం లేదు’ అని ధ్వజమెత్తారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. కానీ, ప్రభుత్వం సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పండించిన వడ్లన్నీ దళారుల పాలయ్యాయి’ అని విమర్శించారు.
రాఘవపూర్‌లో 4-5 వేల క్వింటాళ్ల వడ్లను ఇప్పటికే స్థానిక రైస్ మిల్లులకు, దళారులకు రైతులు అమ్ముకున్నారని చెప్పారు. అబ్బుల దేవయ్య అనే రైతు 92 క్వింటాళ్ల వడ్లు కల్లంలో పోసి నెల రోజులు ఎదురుచూసి, కొనే దిక్కులేక క్వింటాకు రూ.1,900 చొప్పున తక్కువ ధరకే అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుకు క్వింటాకు రూ.420కి పైగా నష్టం వచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ ఇస్తానన్న బోనస్‌తో కలిపితే రూ.81 వేలు ఈ ప్రభుత్వ చేతగానితనంతో ఆ రైతుకు నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారని, కనీసం ఒక మంత్రి అయినా ఇప్పుడు వడ్ల కల్లాలకు పోయి ఏంటి పరిస్థితి అని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. బోనస్ ఇవ్వకుండా, వడ్లను కొనకుండా రైతులకు అన్ని విధాలుగా రేవంత్‌రెడ్డి సరార్ నష్టం చేసిందని విమర్శించారు.
నాడు కేసీఆర్ ప్రభుత్వం కలుపు కాకముందే రైతుబంధు పైసలు ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. సకాలంలో ఎరువులందించి పంట కొయ్యకముందే గన్నీ బ్యాగులు తెచ్చి మిల్లులతో సమన్వయం చేసి పంటను కొనుగోలు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రేవంత్‌రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగబెట్టిండు.. బోనస్ బోగస్ చేసిండు, వడ్లు కొనే దికులేని పరిస్థితి చేసిండు. రూ.2 లక్షలు రుణమాఫీ రాఘవపూర్‌లో సగం మందికి ఇంకా కాలేదు అని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 శాతం వడ్లను రైతులు దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌లో రెండే మంచిగా జరుగుతున్నాయి.. ఒకటి ఒట్లు, రెండు తిట్లు అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎవరైనా ఏదైనా అడిగితే తిట్టుడు.. నమ్మతలేరు అనుకొని దేవుని మీద ఒట్లు పెడుతున్నారని చెప్పారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని కనిపించిన ప్రతి దేవుడి మీద ఒట్టు పెట్టిండు, ఓట్లు డబ్బాలో వేసుకున్నాక మోసం చేశాడని విమర్శించారు. కేసీఆర్ ఉండగా దవాఖానకు పోతే కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టి తల్లిని, పిల్లను ఇంటిదగ్గర దించిపోయినట్టు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కిట్టు, ఆడబిడ్డలకు చీరలు బంద్ పెట్టిండు. రూ.4 వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, కేసీఆర్ ఇస్తున్న రూ.2 వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగబెట్టిండు. ముసలోళ్ల పెన్షన్ కూడా ఎగబెట్టిన పుణ్యాత్ముడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అని హరీశ్‌రావు తెలిపారు. నువ్వు బర్త్‌డే జరుపుకుంటే మాకు కంటగింపు ఏం లేదు.. కానీ, ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు.
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి, అటు సూర్యుడు ఇటు పొడిసినా పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తానని మాట తప్పినందుకు తప్పయిందని దేవుడి ముందు ముకు నేలకు రాయి.. రేవంత్‌రెడ్డీ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పాలకుడే పాపాత్ముడైతే ఆ రాజ్యానికి అరిష్టం అయితదంట.. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే దేవునిమీద ఒట్టేసి మాటతప్పితే ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతదని అన్నారు. ఇంకా నాలుగేండ్ల సమయం ఉంది ప్రజలకు మంచి చెయ్యి, కానీ ఇట్లా మోసం చేస్తే మాత్రం బీఆర్ఎస్ తరఫున విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
‘రైతుబంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ చెయ్యాల్సిందే, పంట కొనాల్సిందే.. అప్పటి వరకు నిన్ను విడిచి పెట్టం’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని హితవు పలికారు. కరెంటు కూడా సరిగా ఉండటం లేదని, మోటర్లు కాలుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యాసంగి పంట వెయ్యడానికే రైతులు భయపడుతున్నారని చెప్పారు. ఏఐసీసీ ట్విట్టర్లో తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని పెట్టుకుంటున్నారని, ఎకడైనా 24 గంటల కరెంటు వస్తుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చారని, కాంగ్రెస్ అంతా 15 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని, రూ.7,500 ఉంటే 5,500కే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మిల్లర్లతో సమన్వయం చేసుకొని మద్దతు ధరకే వడ్లు కొనాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఒక్క కిలో అయినా సన్న వడ్లను కొన్నారా? అని ప్రశ్నించారు. వానాకాలం, యాసంగి పంటలకు ప్రభుత్వం రైతులకు బాకీపడ్డ ఎకరాకు రూ.15 వేల రైతుబంధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొన్న వడ్లకు 48 గంటల్లో డబ్బు చెల్లించి రైతులకు కొంత ఊరట ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పైన సీఎం రేవంత్ ఒట్లకు మొకాలే అని ఎద్దేవా చేశారు.