Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్‌పై వాడీవేడిగా చర్చ సాగుతున్నది. ఘోష్ కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. అయితే, ఆయన ప్రసంగానికి మంత్రులు అడ్డు తగిలారు. శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలుసార్లు అడ్డుకోగా.. హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఇవాళ ఎజెండాలో పెట్టిందే ఘోష్ కమిషన్ నివేదిక. అందుకే నేను కమిషన్‌పై మాట్లాడుతున్నాను. ఆ నాటి విచారణ దేనిపై జరిగింది? విచారణ చేసింది ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అయినా కాంగ్రెస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఆ రోజు తప్పుపట్టింది. వాళ్లు చేస్తే రైట్ అట. మరి ఈ రోజు దేనిపై? తెలంగాణ రైతుల కష్టాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రపూరితంగా వేసిన కమిషన్. విధివిధానాలను కాలరాస్తూ.. చట్టాన్ని తుంగలో తొక్కుతూ.. ప్రతివాదనలకు అవకాశం ఇవ్వకుండా.. ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్ట్‌ను మేం తప్పుపట్టడం కరెక్ట్ కాదని శ్రీధర్‌బాబు మాకు సుద్దులు చెబుతున్నడు. మీపై వేసిన కమిషన్‌ను మీరు వ్యతిరేకిస్తే తప్పు కాదు కానీ.. మేం వ్యతిరేకిస్తే తప్పా? షా కమిషన్ ఆ రోజు ఇందిరా గాంధీకి 8బీ కింద నోటీసులు ఇచ్చింది.
కానీ, ప్రొసీజర్స్‌లో లోపాలున్నాయని ఢిల్లీ హైకోర్టుకు ఆనాడు ఇందిరా గాంధీ వెళ్తే.. 7 నవంబర్ 1978 నాడు ఢిల్లీ హైకోర్టు నాడు షా కమిషన్ రిపోర్ట్‌ను రద్దు చేసింది. కాంగ్రెస్, ఇందిరా గాంధీ గురించి చెప్పాను. ఇక బీజేపీ మిత్రుల గురించి చెప్పాలి. బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు 16 డిసెంబర్ 1992 రోజున పీవీ నరసింహరావు ప్రధానిగా లిబ్రహం కమిషన్ వేయడం జరిగింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషిపై పీవీ ప్రభుత్వం కమిషన్ వేస్తే.. ఇది భారతదేశంలో ఒక రికార్డు. ఈ కమిషన్ 17 సంవత్సరాలు నడిచింది. 45 సార్లు ఈ కమిషన్‌కు పొడిగింపు ఇచ్చారు. 17 సంవత్సరాలు షోదించి షోధించి రిపోర్ట్ ఇచ్చారు. ఆ నాడు వాళ్లపై కమిషన్ వేస్తే బీజేపీ నాయకులు అన్యాయమని, రాజకీయ కక్ష్య సాధింపని ఆ రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు చేశారు. మరి మాపై కూడా కమిషన్ వేసింది రాజకీయ ప్రేరేపితం, కుట్ర మాత్రమే. ఆ రోజు లిబ్రహం కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైంది? 8బీ కింద ఆ రోజులు ప్రొసీజర్ సరిగా ఫాలో కాలేదని.. అద్వానీ, జోషిపై వేసిన కమిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎప్పుడైనా ప్రొసీజర్ ఫాలో కాకపోతే 1952 కమిషన్ యాక్ట్ కింద నిలబడవు. ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా చెల్లదు. 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు అర్థమవుతుందో కోర్టు రిపోర్టును కొట్టివేస్తుంది’ అని స్పష్టం చేశారు. హరీశ్‌రావు మాట్లాతుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డు తగిలారు.
‘ఆ తర్వాత మళ్లీ హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘కోర్టు కేసు గురించి మాట్లాడవద్దని అంటున్నరు. మరి కోర్టుకు ఇందిర గాంధీ, ప్రణబ్ ముఖర్జీ ఎందుకు వెళ్లారు. ఎవరైనా తన హక్కులకు భంగం వాటిల్లితే వెళ్లే అవకాశం ఉంటుంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చించవద్దని కోర్టుకు వెళ్లారని అన్నారని.. మేం రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని కోర్టుకు వెళ్లాం తప్పా.. అసెంబ్లీలో చర్చించొద్దని వెళ్లలేదు’ అన్నారు. ఆ తర్వాత మళ్లీ హరీశ్‌రావు ప్రసంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అడ్డుకున్నారు. సభలో చర్చించొద్దని కోర్టుకు వెళ్లారని అనడంతో.. హరీశ్‌రావు స్పందిస్తూ.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి సరిగా ప్రిపేర్ కాలేదని.. ఒకసారి అడ్వకేట్ జనరల్‌కు ఫోన్ చేసి నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి.. మాట మార్చొద్దని అన్నడు. మాట మార్చే అలవాటు కోమటిరెడ్డి వెంకన్నకు ఉంటది నాకు ఉండదు. విషయం చెప్పాలి. అధ్యక్షా మీరు అనుమతి ఇస్తే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను తీసుకువచ్చాను. అనుమతి ఇస్తే వీడియో చూపిస్తాను.
వెంకట్‌రెడ్డి ఈ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టులాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదని వెంకట్‌రెడ్డి చెప్పారు’ అని గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ మంత్రి వెంకట్‌రెడ్డి హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆ తర్వాత హరీశ్‌రావు మాట్లాడుతూ.. నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. మంత్రి లేచి నాపై 20 నిమిషాలు మాట్లాడితే.. రెండు నిమిషాలైనా చెప్పుకోవాలి కదా? ఇప్పటికే ఐదుసార్లు అడ్డుతగిలారు. ‘ఇదే వెంకట్‌రెడ్డి కేసీఆర్ కాళేశ్వరం ప్రజంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రిపేర్ అయి రాలేదని పోయిండు. ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ అద్భుతంగా పని చేసిండు.. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని అని చెప్పిండు’ హరీశ్‌రావు గుర్తుచేశారు. దాంతో మళ్లీ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కల్పించుకొని హరీశ్‌రావు హద్దులు దాటుతున్నారన్నారు. లిమిట్‌లోనే ఉండాలని.. జరగని సంఘటనను చిత్రీకరిస్తున్నారంటూ అసభ్య పదజాలం వాడారు. దీనికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ‘పాపం దొరికిపోయారు. ఇబ్బందిపడుతున్నరు. ఆ ఫస్ట్రేషన్ కనిపిస్తుంది. ఆన్సర్ లేదు. మా ఉత్తమన్న ఫస్ట్రేషన్లోకి వెళ్తున్నడు. నేను అర్థం చేసుకుంటున్న. ఏదేమైనా వదిలేస్తున్నాను’ అని తన ప్రసంగాన్ని కొనసాగించారు.