హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘బతుకు దెరువు కోసం, కుటుంబాలను పోషించుకొనేందుకు జోర్డాన్ వెళ్లాం. కానీ, ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించడం లేదు. మమ్మల్ని కాపాడండి’ అంటూ గల్ఫ్ కార్మికులు పంపిన ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ వారికి దారిచూపింది. వాట్సాప్ ద్వారా తెలంగాణ గల్ఫ్ కార్మికుల గోడు విన్న మాజీ మంత్రి హరీశ్‌రావు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు 12 మందిని ఎలాగైనా రప్పించాలని నిశ్చయించుకున్నారు. వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తన కార్యాలయానికి సూచించారు. 12 మందికి స్వయంగా ఫోన్ చేసి.. ‘ధైర్యంగా ఉండండి.. ఎట్లయినా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువస్తాం’ అని భరోసా ఇచ్చారు. ఒకవైపు, జోర్డాన్ గల్ఫ్ కార్మికుల సమస్యను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి సాయంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకోవైపు, సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకెళ్లొచ్చని గల్ఫ్ కంపెనీ సూచించడంతో దానికి అంగీకరించారు.
గల్ఫ్ కార్మికులను తెలంగాణకు తీసుకొనిరావడంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేని పనిని హరీశ్‌రావు చేసి చూపించారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారంతో సంబంధం లేదని నిరూపించారు. ఆ 12 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతోపాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీశ్‌రావు భరించారు. ఇప్పటికే విమాన టికెట్ల బుకింగ్ ప్రక్రియ కూడా పూర్తిచేశారు. మరో వారంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన 12 మంది గల్ఫ్ కార్మికులు తమ సొంత ఊర్లకు రాబోతున్నారు. త్వరలో స్వదేశానికి తిరిగి రాబోతున్నామని, తమ కుటుంబసభ్యులను కలుసుకోబోతున్నామని జోర్డాన్‌లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్‌లో చికుకున్న 12 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లుచేశామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వారు వచ్చే వారం రోజుల్లో ఇకడకు చేరుకుంటారని తెలిపారు. ఇది తనకెంతో సంతృప్తిని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమ ప్రాధాన్యంగా సాగిన కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ అయితే, 22 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో వలసలు మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే, గల్ఫ్ కార్మికులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న.. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమ బోర్డు ఇప్పటికీ అతీగతీలేదని దుయ్యబట్టారు. కనీసం టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటుచేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.