Harish Rao | సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి 10కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో యువత, క్రీడాకారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగిన 10కే రన్‌తో జిల్లా దశాబ్ది సంబురాలకు ఆరంభం లభించింది.
సిద్దిపేటలో నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లా దశాబ్ది పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు నివాళులర్పించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే విద్యార్థి, యువజన సదస్సులో పాల్గొననున్నారు. జిల్లా ఆవిర్భావం నుంచి పదేళ్లలో సాధించిన ప్రగతిని గుర్తుచేసుకుంటూ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.