Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే సిట్ విచారణ పేరుతో తనపై రేవంత్ కక్ష సాధించాలనుకుంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిట్ కాదు.. అది ట్రాష్ అంటూ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం హరీష్ రావు మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేశారు. రేవంత్ ఇచ్చిన సిట్ నోటీసు పూర్తిగా ట్రాష్. సిట్ అడిగిందేమీ లేదు. గంట ప్రశ్నలు అడగడం ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం. ఇదే ఈ రోజంతా సిట్ అధికారులు చేసిన పని. ఆ ఫోన్ రేవంత్ చేశాడో, సజ్జనార్ చేశాడో. ఎన్నిసార్లు పిలిచినా సిట్ విచారణకు హాజరవుతా. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. మీరిచ్చిన నోటీసులు నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్ట్, సుప్రీం కోర్టు.. రెండూ నాపై కేసులు కొట్టివేశాయి. నాకు నైతిక మద్దతు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు. సంఘీభావం తెలిపిన పార్టీ నేతలకు శిరసువంచి నమస్కరిస్తున్నా. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. రేవంత్ బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే నాపై కక్ష సాధింపు. పొద్దున ఆరోపణ చేస్తే సాయంత్రం నోటీసు పంపించారు.
బొగ్గు కుంభకోణంపై హైకోర్టు జడ్జికి ఆధారాలిస్తాం. బొగ్గు కుంభకోణంలో మొదటి లబ్ధిదారుడు రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి. అతడు వేల కోట్ల కుంభకోణానికి తెరతీశాడు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాం. సింగరేణి టెండర్ సైట్ విజిట్ అంశంపై మేం ప్రశ్నించాం. దేవుడిపై ఒట్లు వేసి మోసం చేశావు అంటే యాదాద్రిలో రేవంత్ కేసు పెట్టించాడు. ఏదో ఒక కేసులో రేవంత్ ఇరికించాలని చూస్తున్నాడు. రేవంత్ ప్రభుత్వం కుంభకోణాల మయంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ స్కాములపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.