Harish Rao | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహా ఇతర నాయకులను నిర్బంధించటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వలేని నిర్బంధం కొనసాగుతున్నదని మండిపడ్డా రు. రైతు భరోసా పేరిట కాంగ్రెస్ చేసిన మోసంపై ఆదివారం వరంగల్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహా పార్టీ నేతలను పోలీసులు నిర్బంధించటం అత్యంత దుర్మార్గమని నిప్పులు చెరిగారు.
ఎకరాకు రూ. 7,500 ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై యావత్ తెలంగాణ రైతాంగం చీదిరించుకుంటున్నదని విమర్శించారు. రైతులు ఎకడ తిరగబడతారోనని మంత్రుల పర్యటనల్లో భారీగా పోలీసులను మోహరించి ఎన్నాళ్లు తప్పించుకుంటారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ఎండగడుతూనే ఉంటామని, ఎకడికకడ నిలదీస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. సుదర్శన్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.