Harish Rao | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ తాజా బడ్జెట్ గారడీ మాటలు, గాలిమేడలు అన్నట్టుగా సాగిందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. అంకెలు చూస్తే ఆర్భాటంలా.. పనులు చూస్తే డొల్లతనంలా కనిపిస్తున్నదని ధ్వజమెత్తింది. తుది దశలో ఉన్న ఆరు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని గత బడ్జెట్లో చెప్పిన ప్రభుత్వం.. ఏ ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసిందో, ఎన్ని ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసింది. వాస్తవ విరుద్ధంగా బడ్జెట్ రూపొందించడంపై బీఆర్ఎస్ దుమ్ముదులిపింది. ఆ పార్టీ శాసనసభాపక్షం తరఫున మాజీ ఆర్థికమంత్రి హరీశ్‌రావు శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. గత, తాజా బడ్జెట్లను పోల్చిచూపుతూ.. సర్కారు మాటలకు, చేతలకు పొంతనలేని తీరును ఎండగట్టారు. ఏడాదికి కనీసం 20 వేల కోట్లు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని గత బడ్జెట్లో చెప్పారని, 16 నెలల్లో ఒక రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున, మొత్తం 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారని, కానీ 16 నెలల్లో నాలుగు ఇండ్లన్నా కట్టలేదని నిలదీశారు. రేవంత్, భట్టి కలిసి నిర్మించిన గాలిమేడగా బడ్జెట్‌ను హరీశ్ అభివర్ణించారు.
ఏడ బోయింది మీ రైతు భరోసా?
రుణమాఫీకి రూ.31 వేల కోట్లు సమీకరించుకున్నామని గత బడ్జెట్లో చెప్పిన ప్రభు త్వం.. ఇప్పుడు 20 వేల కోట్లు ఖర్చుచేశామని ఎలా చెప్పిందని హరీశ్ నిలదీశారు. రైతు భరోసా 12 వేలకు కుదించి, యాసంగిలో సగం మందికైనా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇది మార్పు కాదు.. ఏమార్పు
‘మహాలక్ష్మి కింద రూ.2500, పింఛన్ రూ. 4 వేలకు పెంపు, రూ.15వేల రైతు భరోసా, రూ.2 లక్షల లోపు రుణమాఫీ, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు సూటీలు, 5 లక్షల విద్యా భరోసా కార్డు, పంటలకు బోనస్, ఆర్టీసీ విలీనం, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేలు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేసింది’ అని హరీశ్ విమర్శించారు. ఎన్నికల ముందు ‘నో ఎల్ఆర్ఎస్’ అని ఇప్పుడు ముకుపిండి వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రైజింగ్ కాదు.. డౌన్‌ఫాల్!
తెలంగాణ రైజింగ్ అని చెప్తున్నారని కానీ, వాస్తవానికి అన్నింటా డౌన్‌ఫాల్ కొనసాగుతున్నదని హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా అంటూ దికుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాలేదని పేర్కొన్నారు. హైడ్రా పేరిట, మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట సృష్టించిన భయానక వాతావరణం వల్ల పెట్టుబడులు రాలేదని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పారు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
బీఆర్ఎస్ కృషి వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతున్నదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.‘ఏ ఊరికి పోదామో చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని తేలితే క్షమాపణ చెప్పడానికి నేను సిద్దం? మీరు రెడీనా? అని సవాల్ విసిరారు.
అన్నిరంగాలూ ధ్వంసం
కాంగ్రెస్ పాలనలో ఒకో వ్యవస్థ దారుణంగా ధ్వంసమైందని హరీశ్ వాపోయారు. ‘15 నెలల్లో 83 మంది గురుకుల విద్యార్థులు మరణించారు. 1,913 ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసేసింది. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, సాలర్షిప్లకూ రూపాయి కూడా ఇవ్వలేదు’ అని హరీశ్ తూర్పారబట్టారు. కేసీఆర్ శ్రీకారం చుట్టిన విదేశీవిద్య పథకానికి కాంగ్రెస్ మంగళం పాడిందని మండిపడ్డారు.
ఎనుముల పాలనలో భూములు ఖతం
గచ్చిబౌలిలో 400 ఎకరాలను అమ్మి 30 వేల కోట్లు రాబట్టాలని చూస్తున్నారని, ఇప్పటికే టీజీఐఐసీ భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్ల అప్పు తెచ్చారని హరీశ్ మండిపడ్డారు. హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20 వేల కోట్ల అప్పుతెస్తమని ఇటీవలే అసెంబ్లీలో సమాధానం చెప్పారని గుర్తుచేశారు. ఫార్మాసిటీకి పచ్చని భూములెలా తీసుకుంటారంటూ సీతక, భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాదయాత్ర చేసి మరీ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే భూములు వాపస్ చేస్తామని చెప్పారు. 14 వేల ఎకరాలు వాపసు ఇచ్చుడు లేదు..ఇంకో 16 వేల ఎకరాలు తీసుకుంటమని చెప్తున్నారని హరీశ్ ధ్వజమెత్తారు.
1.62 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిన కేసీఆర్
అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దకేలా చేసింది కేసీఆర్ అని హరీశ్ తెలిపారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాలా లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ధోకా
‘ఏడాదికి 20 వేల కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద పెడుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ఊదరగొట్టారు. మొదటి బడ్జెట్లో ఏమీ చేయలేదు. రెండో బడ్జెట్లోనూ 11 వేల కోట్టు మాత్రమే పెట్టారు’ అని హరీశ్ విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గత బడ్జెట్లో రూ.33,127 కోట్లు కేటాయిస్తే.. డిసెంబర్ నాటికి రూ.9,824 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని అన్నారు. అంబేదర్ అభయహస్తం పేరిట దళితులకు 12 లక్షల చొప్పున ఇస్తామన్నారని, గతంలో మంజూరైన వారికీ నిధులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు గత బడ్జెట్లో 3003 కోట్లు పెట్టి.. వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదని పేర్కొన్నారు. వంద రోజుల్లో రెండోవిడత గొర్రెల పంపిణీ చేపడుతామని చెప్పి మాట తప్పారని.. నాయిబ్రహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తు పథకం అమలు ప్రశ్నార్థకమైందని విమర్శించారు.
పడకేసిన పల్లె ప్రగతి
గ్రామాల్లో పల్లె ప్రగతి పడకేసిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పంచాయతీల బాగు కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా పల్లె ప్రగతికి 277 కోట్లు, పట్టణ ప్రగతికి 174 కో ట్లు ఇచ్చింది. ఇప్పుడవన్నీ బంద్ అయినయ్. ఒక్కో పంచాయతీ సెక్రటరీ 10 లక్షల వరకు అప్పుల పాలయ్యారు’ అని తెలిపారు.వ్యవసాయ స్థిరీకరణకు కేసీఆర్ ఐదంచెల వ్యూహం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పాలన అని హరీశ్‌రావు చెప్పారు. ‘వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ ఐదంచెల వ్యూహం అమలు చేశారు. అందువల్లే 2014లో 131 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం.. తొమ్మిదిన్నరేండ్లలో 221 లక్షల ఎకరాలకు పెరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం, కొత్తవి చేపట్టడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించామని వివరించారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. రూ.5 లక్షల వరకు రైతుబీమా అమలు చేశామని చెప్పారు.
సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు సేఫ్‌గా ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా శాసనమండలిలో చెప్పారు. కాళేశ్వరం అంటే మూడు బరాజ్‌లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 1,531 గ్రావిటీ కెనాల్స్. అన్నీ బాగున్నయ్. కేవలం మేడిగడ్డ బరాజ్‌లో ఏడు బ్లాకులు ఉంటే, ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది.ఇంత మాత్రానికే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేయడం మంచిది కాదు.
ఇది రాష్ర్టానికి నష్టం చేస్తుంది. – హరీశ్‌రావు
మీరు పెట్టగలిగే పూర్తిస్థాయి బడ్జెట్లు నాలుగే. అందులో రెండు పూర్తయిపోయినయ్. కానీ కలలు మాత్రం నిజమయ్యే దాఖలాలు కనిపించడం లేదు.
సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడింది. ఏ రాష్ట్రానికీ లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? ప్రపంచంలో, దేశంలో కాదు.. మీ బుద్ధిలో, మీ ఆలోచనలోనే మాంద్యం ఉన్నది!
బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినయి. గాంధీలిచ్చిన వాగ్దానాలు గాలి మాటలే అయినయి. ఆరు గ్యారెంటీలకు దికు లేదు గానీ, అందాల పోటీలు పెడుతరట. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టున్నది.
వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు, హైడ్రా విధ్వంసం వల్ల పేద, మధ్యతరగతి జనం గుండె ఆగి చనిపోతున్నరు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉపాధి దెబ్బతిని ఆటోడ్రైవర్లు చనిపోతున్నారు. చివరకు గురుకులాల చిన్నారులు కలుషిత ఆహారం తిని మరణిస్తున్నారు. వీటిన్నిటికీ బాధ్యత రేవంత్‌రెడ్డిదే. ఎందుకంటే సీఎం, హోంమంత్రి, సోషల్వెల్ఫేర్ మంత్రి, విద్యా మంత్రి అన్నీ ఆయనే!
2022లో దేశవ్యాప్తంగా ఉత్తమ పంచాయతీ అవార్డులిస్తే, 20కి 19 అవార్డులు తెలంగాణకే వచ్చినయ్. 2023లో 13 వచ్చినయ్. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే.. 2024లో రాష్ర్టానికి వచ్చింది ఒక అవార్డే!
రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రూ.5 లక్షలపైబడి చికిత్స పొందినవారి సంఖ్య 200లోపే. రూ.12 కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ హయాంలో 607 మందికి రూ.40 కోట్లతో చికిత్స అందించినం.
ఇవాళ రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్న ఒకే ఒక్క ఎర్రర్ కారణంగా, టెర్రర్ను చవిచూపిస్తున్నరు. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కొలమానం. కానీ ఈ ఏడాది క్రైం రేటు 24శాతం ఎకువగా నమోదైందని డీజీపీనే చెప్తున్నరు.
అసెంబ్లీ సాక్షిగా ‘బడే భాయ్.. చోటే భాయ్’ బంధం బట్టబయలైంది. రాష్ట్రానికి నిధులివ్వని కేంద్రాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తుమాట అనకపోవడమే ఇందుకు నిదర్శనం.