హైదరాబాద్ మే 18 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీర్లు, బార్లను నమ్ముకొని పాలన సాగిస్తున్నది. మద్యం ధరలు పెంచి ఖజనా నింపుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చి పేదల బతుకులను రోడ్డున పడేస్తున్నది’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పాలన గాలికొదిలి పథకాలను అటకెక్కించి ఎైక్సెజ్శాఖపై ఎక్సర్సైజ్ చేస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. తెలంగాణ రైజింగ్ అంటే మద్యం ఆదాయం పెంచుకోవడమేనా? అని నిలదీశారు. నాడు మద్యంపై రాద్ధాంతం చేసిన వాళ్లే నేడు లిక్కర్ రేట్లతో వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలని చూడటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. ఓ వైపు మద్యం ధరలు పెంచడం, మరోవైపు అమ్మకాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడం రేవంత్ మార్క్ మార్పునకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికే బీర్ల ధరలను 15శాతం పెంచిన సర్కారు, ఇప్పుడు లిక్కర్ రేట్లను పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల ముందు సుద్దపూస మాటలు చెప్పి, అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరలను పెంచడం విడ్డూరమని ఫైర్ అయ్యారు.
దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేసి రాష్ట్ర పరపతిని దిగజార్చడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని తూర్పారబట్టారు. రేవంత్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శించారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో లిక్కర్ రేట్లను పెంచి ఖజానాను నింపుకోవాలని నిర్ణయించడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఎన్నికల హామీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం చెందిందని ఆయన దుయ్యబట్టారు. ‘అభయహస్తం మ్యానిఫెస్టో 29వ పేజీలో ఎైక్సెజ్ విధానాన్ని పునఃపరిశీలిస్తామంటిరి.. బెల్ట్ షాపులను రద్దు చేస్తమని ఊదరగొడితిరి..ఇప్పుడు మాత్రం ధరలు పెంచి పేదలపై భారం మోపితిరి’ అంటూ ధ్వజమెత్తారు. ‘ధరలు పెంచడమేనా ఎైక్సెజ్శాఖలో మీరు తెచ్చే సంస్కరణలు? అమ్మకాలు రెట్టింపు చేయడమేనా మీరు తెచ్చిన పాలసీ మార్పులు?’ అంటూ ప్రశ్నలు సంధించారు. మ్యానిఫెస్టోలో చెప్పింది చేయకపోవడమే రేవంత్ పాలనా విధానమని చురకలంటించారు.
‘రేవంత్ మార్క్ పాలనతో దివాలా తీసిన గల్లా పెట్టెను నింపుకొనేందుకు గల్లీగల్లీల్లో బెల్ట్ షాపులు తెరవాలని, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం కాంగ్రెస్ దివాలా కోరు విధానాలకు నిదర్శనం’ అని హరీశ్ దుయ్యబట్టారు. ఓవైపు ఎైక్సెజ్ ద్వారా ప్రజల నుంచి డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తూ, మరోవైపు సంక్షేమ పథకాలకు మాత్రం బడ్జెట్లో కోత పెట్టిందని విమర్శించారు. ‘స్కీంలను ఎత్తేసి పేదలను ముంచడం..మద్యం ధరలు పెంచి ప్రజల నుంచి డబ్బులు గుంజడం..వారిని రోడ్డున పడేయడం.. ఇదేనా రేవంత్ సర్కారు తెచ్చిన మార్పు?’ అని విరుచుకుపడ్డారు. వెంటనే మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పేదలు, ముఖ్యంగా ఆడబిడ్డల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.