Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/ చేగుంట : వరద సాయం చేయాలని కోరితే సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై బురద జల్లుతున్నాడని, ముఖ్యమంత్రి హోదాను దిగజార్చి విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘దుఃఖంలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి సీఎం ప్రతిపక్షాల మీదపడి ఏడుస్తున్నడు. రేవంత్‌రెడ్డి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నరు.
ఆయన చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్ అని మరోసారి నిరూపించుకున్నడు’ అంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను సీఎం ఒప్పుకొన్నాడని దుయ్యబట్టారు. వర్షాలను లెక్కచేయకుండా ఏపీలో 74 ఏండ్ల సీఎం బయట తురుగుతుంటే, మన సీఎం ఇంట్లో ఫిడేల్ వాయించాడని ఎద్దేవాచేశారు. రాజకీయాలు పకనబెట్టి ప్రజలకు భరోసా ఇచ్చేలా మాట్లాడాలని సూచించారు.
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఐబీ గెస్ట్‌హౌస్‌లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి హరీశ్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాలు, వరదలతో 16మంది చనిపోయినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా మొత్తం 31 మంది చనిపోయినట్టు తమకు సమాచారం ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని విమర్శించారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం మొద్దునిద్ర పోయిందని, ముందస్తు చర్యల్లో విఫలమైందని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు విఫలమయ్యారని, అక్కడ కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్లిస్తే తొమ్మిది మందిని కూడా కాపాడలేక పోయారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదల్లో చనిపోయిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఖమ్మంలో సాయమడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులమంతా కలిసి వరద బాధితులకు విరాళాలు అందిస్తామని చెప్పారు.
ప్రజలు ఆపదలో ఉంటే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజకీయాలు మాట్లాడటం శోచనీయమని ఎక్స్‌వేదికగా హరీశ్ విమర్శించారు.‘ మీలాగ మేం విమర్శలు చేయలేక కాదు, ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం ముఖ్యం, ప్రజలు మీమీద మండిపడుతున్నరు.. ముందు సహాయక చర్యలపై దృష్టి పెట్టండి’ అని హితవుపలికారు.
మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హరీశ్ పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను రాజకీయ విమర్శలతోనే ఎదురోవాలని, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుర్భాషలాడటం గర్హనీయమన్నారు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
‘ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు.. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుకుపోతున్నదని’ అని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ సహాయక చర్యలు అందలేదని జనం ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం మనసుపెట్టి చర్యలు చేపట్టాలని, వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.పదివేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. భారీ వర్షాలను లెక చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి విధినిర్వహణలో తలమునకలైన విద్యుత్తు ఉద్యోగులను హరీశ్ అభినందించారు.