అందోల్, జూన్ 25: ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు పోయిన వానకాలం, యాసంగికి సంబంధించి రూ.12 వేలు బాకీ పడింది.. ముందు దీనికి సమాధానం చెప్పకుండా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాటమాటకు చర్చకు పోదామంటూ దుంకుతున్నడు. ఏ టీవీలో కూర్చుందామో? ఎక్కడ మాట్లాడదామో చెప్పు?’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. అబద్ధాలు ఆడడంలో నంబర్‌వన్ సీఎం రేవంత్‌రెడ్డి అయితే, మహేశ్‌కుమార్‌గౌడ్ నంబర్-2 అని, ఆ ఇద్దరికీ అబద్ధాలు ఆడటంలో ఆస్కార్ ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్పాటిల్తోపాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన హరీశ్‌రావు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నాట్ల సమయంలో రైతుబంధు డబ్బులు వేస్తే, కాంగ్రెస్ మాత్రం ఓట్ల సమయంలో డబ్బులు వేస్తుందని విమర్శించారు. కేసీఆర్ రైతుబంధు ప్రారంభించినప్పడు ఓట్లు ఉండెనా? కేసీఆర్ గెలిచాక రైతులకు ఏంచేస్తే బాగుంటుందని ఆలోచించి రైతుబంధు పథకం తెచ్చి రైతుల కుటుంబాల్లో ఆనందం నింపారని గుర్తుచేశారు. ఓట్ల కోసం ఏనాడూ ఆయన ఆలోచించలేదని గుర్తుచేశారు. వీటిని మరిచి అబద్ధాలు ఆడటంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు పోటీపడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 18నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
ఈ 18 నెలల కాలంలోనే ప్రజలకు కాంగ్రెస్ అంటే ఏమిటో అర్థమైందని, రాష్ట్రంలో ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి.. కేసీఆరే కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పేనుకు పెత్తనమిస్తే అన్న విధంగా రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా పనిచేస్తూ మల్ల పదేండ్ల దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ విత్తనం కూడా పుట్టకుండా చేస్తున్నారని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ చెప్పే చిల్లర ఉపన్యాసాలను ప్రజలు నమ్మరని లోకల్‌బాడీ ఎన్నికలు పెడితే ఘోరంగా ఓడిపోతామనే భయంతో ఎన్నికలు పెట్టడంలేదని చెప్పారు. 18 నెలల పాలనలో ఒక్క పాజెక్టునైనా పూర్తిచేశారా? ఒక్క ఎకరాకు నీళ్లిచ్చారా? అని నిలదీశారు.
ప్రజా సమస్యలను ప్రస్తావిద్దామంటే అసెంబ్లీని సరిగా నడపడం లేదని, వారానికి మించి సభను నడిపే పరిస్థితిలేదని హరీశ్‌రావు తెలిపారు. సమస్యలపై బీఆర్ఎస్ గట్టిగా నిలదీస్తుందనే భయంతో పారిపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి దమ్ముంటే 40రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సరిపోతారని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్‌లు గెలవాలని అందరం కలిసి ఐక్యతతో ముందుకుపోదామని పిలుపునిచ్చారు.