సిద్దిపేట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపైన నిప్పులు చెరిగారు.
హరీశ్‌రావు ఇంకా ఏమన్నారంటే.. ‘కాంగ్రెసోళ్లు ఒక్కటన్న మంచి పని చేసిండ్రా. కానీ వందల కోట్లు ఖర్చుపెట్టి అందాల పోటీలు పెట్టిండు రేవంత్‌రెడ్డి. ఎవరికి పనికొస్తయ్ ఆ అందాల పోటీలు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఫుట్‌బాల్ ఆడుతడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్‌బాల్ ఆడితే మాకేం వస్తది. నిన్ను ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గర్లనే ఉన్నయ్ రేవంత్‌రెడ్డీ. నువ్వు ఫుట్‌బాల్ ఆడుడు కాదు, నిన్ను ఫుట్‌బాల్ ఆడుతరు తెలంగాణ ప్రజలు. సింగేరేణి పైసలు రూ.10 కోట్లు, సీఎస్ఆర్ పైసలు రూ.100 కోట్లు, గవర్నమెంట్ పైసలు రూ.5 కోట్లతోని స్టేడియంగట్టి ఈయన ఫుట్‌బాల్ ఆడుతడు. ఎవనిగ్గావలె ఈయన ఆట’ అని మండిపడ్డారు.
‘బీఆర్ఎస్ హయాంలో సింగరేణి పైసలతోని స్కూళ్లు కట్టినం. కాలేజీలు గట్టినం. పిల్లల చదువుల కోసం ఆలోచన చేసినం. ఇయ్యాల రేవంత్‌రెడ్డి ఖర్చుచేసిన ఆ డబ్బులుంటే కోటి రూపాయలకొక స్కూల్ కట్టొచ్చు. రోడ్లు వేయించొచ్చు. నువ్వు ఫుట్‌బాల్ కోసం ఖర్చు పెట్టుడు ఏంది..? నువ్వు ఫుట్ బాల్ ఆడుతందుకు వందల కోట్లు ఖర్చు పెడితే మా పిల్లలకు ఏమొస్తది..? మా ప్రజలకు ఏమొస్తది..? నీకు అందాల పోటీల మీదున్న ప్రేమ, ఫుట్‌బాల్ మీదున్న ప్రేమ మా రైతులకు ఎరువులు సరఫరా చేయడంపైన లేకపాయే’ అని విమర్శించారు.
‘మొన్నటిదాకా రైతులు వానల తడుసుకుంట యూరియా కోసం లైన్ల నిబడ్డరు. ఇప్పుడేమో యాప్‌లు, మ్యాప్‌లు అంటున్నరు. ఎవనికి గావాలె ఆ యాప్‌లు, మ్యాప్‌లు. కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి నాలుగు బస్తాల యూరియా తెమ్మంటే తెచ్చి ఇంటిదగ్గర ఏసెటోళ్లు. ఇప్పుడు పొద్దుగాల్నే లేసి సద్దిగట్టుకుని వచ్చి లైన్ల నిలబడే గోస ఏంది..? పంట పండిస్తందుకు నీళ్లు, కరెంటు, ఎరువులు గావాలె. కానీ రేవంత్‌రెడ్డి యాప్‌లు, మ్యాప్‌లు అంటున్నడు. బీఆర్ఎస్ టైమ్‌ల చార్జీలు లేకుండా ఊళ్లల్లకే తెచ్చి ఎరువులు ఇచ్చినం. ఇప్పుడెందుకు అయితలేదు’ అని ప్రశ్నించారు.