Harish Rao | సిద్దిపేట, ఆగస్టు 10: గ్రామాల్లో కుకలు కరుస్తున్నాయి.. గురుకులాల్లో ఎలుకలు కొరుకుతున్నాయి.. కేసీఆర్ పాలనలో పరిస్థితి గిట్లనే ఉన్నదా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ది ఎగవేతలు, కోతల ప్రభుత్వమని విమర్శించారు. ఎన్నిలప్పుడు ఆరు గ్యారెంటీలతోపాటు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెకుల పంపిణీలో ఆయన మాట్లాడారు.
రైతు భరోసా, కల్యాణలక్ష్మి తులం బంగారం మాటలకే పరిమితమైందని విమర్శించారు. రూ.4 వేల పెన్షన్ దేవుడెరుగు.. ఉన్న పెన్షన్రాక రెండు నెలలు అయిందని.. ముసలోళ్లు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా కల్యాణలక్ష్మి చెకులు రావడంలేదని, మధ్యా హ్న భోజన కార్మికులకు, గురుకులాల్లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని మం డిపడ్డారు. గ్రామాలన్నీ చెత్తకుప్పలుగా మారాయని, ట్రాక్టర్ డీజిల్‌కూ పైసల్లేవని, సఫాయి కార్మికులకు జీతాల్లేవని.. జీపీల్లో నిధులే లేవని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చెవుటోని ముందు శంఖం ఊదినట్టుందని ఎద్దేవా చేశారు. పారిశుధ్య నిర్వహణ లేక సీజనల్ వ్యాధులతో పల్లెలు పడకేస్తున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. అంతకుముందు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు తమకు 7 నెలలుగా జీతాలులేవని మాజీమంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, నాయకులు పాల సాయిరాం, కాముని శ్రీనివాస్, గుండు భూపేశ్, కుంభాల ఎల్లారెడ్డి, మట్టె బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నమోదవుతున్న కుకకాటు సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు, గాయపడినవారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ దవాఖానల ద్వారా కుకకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. యాంటీరేబిస్ మందులు అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, దవాఖానల్లో అందుబాటులో ఉంచాలని శనివారం ఒక ప్రకటనలో సూచించారు.
వీధికుకల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని, క్రమం తప్పకుండా మానిటర్ చేస్తూ సంఖ్య పెరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఒకరోజే వరంగల్ ఎంజీఎంలో పసికందు మృతదేహాన్ని కుకలు పీకతినడం, నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కలు దాడి చేయడం, రంగారెడ్డి జిల్లాలో చిన్నారి కుకల దాడిలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందడం వంటి హృదయవిదారక ఘటనలు జరిగినా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని పేర్కొన్నారు.
కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడాన్ని ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. కుకకాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన ఎనిమిది నెలల్లో 343 కుకకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావని పేర్కొన్నా రు. రాష్ట్రంలో 3,79,156 వీధికుకలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలిపిందని, వీటి సంఖ్య రెట్టింపు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు నిలిపివేయడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని, చెత్తాచెదారం పేరుకుపోయి వీధికుకల బెడద మరింత ఎకువైందని ఆందోళన వ్యక్తంచేశారు.
మున్సిపల్ పట్టణాల్లో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధికుకల నియంత్రణ లేకుండా పోయిందని విమర్శించారు. సరైన నిధుల కేటాయింపు లేక కుకలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదని, దీనివల్ల వీధికుకల సంతానం విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వదలడం లేదని మండిపడ్డారు.
యాచారం, ఆగస్టు 10: రంగారెడ్డి జిల్లా యాచారంలో శనివారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి ఐదుగురిపై దాడి చేసింది. ఎల్లమ్మగుడి కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు లడ్డు, లోకేశ్, ఎంజిలీనాలపై దాడి చేసింది. మేడిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు నరసింహాచారి, యాచారానికి చెందిన స్వాతిపై దాడి చేయగా స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు కర్రలతో పిచ్చికుక్కను తరిమేశారు. కుక్కకాటు బాధితులను ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.