హైదరాబాద్ మే 12 (నమస్తే తెలంగాణ): అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నిజం మౌనంగా ఉంటే అబద్ధమే రాజ్యమేలుతుందనే సామెత కాంగ్రెస్ సర్కారుకు అతికినట్టు సరిపోతుందని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లేవని, నీటి కేటాయింపులు జరగలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కాంగ్రెస్ చెప్పిన ప్రతి అబద్ధానికి ఆధారాలు సహా నిజాలను ప్రజల ముందుంచడం బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. 2018 అక్టోబర్ 30న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి అందించిందని పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 113.795 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డిపార్ట్మెంట్ నిర్ధారించిందని వివరించారు.
ఈ ప్రాజెక్ట్ కింద 70.04 టీఎంసీల నీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్రం 2021లో నిర్ధారించిందని గుర్తుచేశారు. ఇంత స్పష్టంగా సీడబ్ల్యూసీ, హైడ్రాలజికల్ అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం అబద్ధాలకు పరాకాష్ట అని హరీశ్‌రావు అభివర్ణించారు. తెలంగాణకు కేటాయించిన కృష్ణా నీటిని వాడుకునే తెలివిలేక ఏపీకి అప్పగించి పెదవులు మూసుకున్న ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర పాలనలో ఎకరాకు నీళ్లివ్వలేని ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ సాధించిన సాగునీటి విజయాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అబద్ధాన్ని వందసార్లు చెప్తే, నిజమవుతుందనే భ్రమలో మంత్రి ఉత్తమ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణకు చేసిన అన్యాయాలు మరిచిపోయారా? ఆంధ్రా ప్రయోజనాల కోసం రాజీవ్, ఇందిరాసాగర్ నిర్మాణాలు చేపట్టింది వాస్తవం కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.