రుణమాఫీ పూర్తిచేసినమని చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి బ్యాంకుల వేధింపులతో రైతుల ఆత్మహత్యలు కనిపించడంలేదా? దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఉసురు ఎందుకు తీస్తున్నరు? రైతుల వరుస బలవన్మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. వీటికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. -హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతుల మరణ మృదంగం మోగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకు వేధింపులకు గిరిజన రైతు జాదవ్ దేవ్‌రావు ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే.. అదే జిల్లాలో రుణభారంతో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని ఆదివారం ఎక్స్ వేదికగా విచారం వ్యక్తంచేశారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, వరుసగా చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ శాపంగా మరిందని మండిపడ్డారు. ఎద్దు ఏడిచ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు పూర్తిగా మర్చిపోయినట్టున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ కాకపోవడంతో అన్నదాతలు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్నారని, ఉన్న భూములను కుదువపెట్టుకొని అప్పులు తెస్తున్నారని వాపోయారు. రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలిపిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ యాక్ట్-30 పేరుతో జిల్లాలో నిరసనలు చేపట్టొద్దని ఆంక్షలు విధించి ప్రశ్నించే గొంతులను అణగదొక్కారని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తూనే ఉంటం
‘రుణమాఫీ అని మభ్యపెట్టి.. 500 బోనస్ అని మోసం చేసి.. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ దురవస్థ ఏర్పడింది. రైతు సోదరులారా.. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. మరణం పరిష్కారం కాదు. మీకు అండగా బీఆర్ఎస్ ఉన్నది. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టినట్టుగా అందరికీ రుణమాఫీ, రైతుభరోసా, అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీలు అమలు చేసేదాకా ఈ సర్కార్‌ను నిలదీస్తూనే ఉంటం’ అని హరీశ్ హెచ్చరించారు.
దేశానికి వెన్నెముక అయిన రైతుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటమాడుతున్నది.ఏడాది పాలనలో 402 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నరు. ఇంత జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుండటం దుర్మార్గం. పదేండ్ల పాలనలో వ్యవసాయాన్ని కేసీఆర్
లాభసాటిగా మారిస్తే, రేవంత్‌రెడ్డి సంక్షోభంలోకి నెట్టిండ్రు. -హరీశ్‌రావు