హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కోకాపేటలో కేసీఆర్ సర్కార్ ఐదెకరాల్లో రూ.7కోట్లతో దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి ఇస్తే.. రేవంత్ సర్కార్ కురుమల ఆత్మగౌరవ భవనాన్ని అద్దెకు ఇవ్వడం దుర్మార్గమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ వైఖరితో దొడ్డి కొమురయ్య ఆత్మ ఘోషిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మగౌరవ భవనాలను ప్రైవేట్‌పరం చేసే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. శనివారం హైదరాబాద్‌లోని నివాసంలో హరీశ్‌రావును రాష్ట్ర కురుమ సంఘం నాయకులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
గొర్రెల పంపిణీని పునః ప్రారంభించాలి
నిరుపేద గొల్ల కురుమల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. కొత్త యూనిట్ల పంపిణీని నిలిపివేసి వేలాది కుర్మ, యాదవుల కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. గొర్రెల పంపిణీని పునః ప్రారంభించాలని, దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం-వసతి గృహాన్ని ప్రైవేట్‌పరం చేసే యత్నాలను విరమించుకోవాలని, కురుమ, యాదవ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.