Harish Rao | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : వరంగల్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ‘శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్టు ఉన్నది రేవంత్‌రెడ్డి పరిస్థితి’ అని దెప్పిపొడిచారు. 11 నెలల పాలనలో రేవంత్ నోటి వెంట బూతులు తప్ప నీతులు రాలేదని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని.. చేసిందేం లేక, చెప్పుకోడానికేం లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు మాట్లాడిండు.. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడా బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు నిన్ను మరిచిపోరు’ అని హెచ్చరించారు.‘నీ వదురుబోతు తనంతో రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నం’ అని ఫైర్ అయ్యారు. రాష్ర్టానికి ఏం ఒరగబెట్టారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు ఏడాదైనా అతీగతీ లేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, రూ.15 వేల భరోసా దికులేదని, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇవ్వనేలేదని, బోనస్ బోగస్ చేశారని దుయ్యబట్టారు. ‘ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒకటీ అమలు చేయలేదు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్‌రెడ్డీ? మీ పది నెలల పాలనలో రాష్ర్టాభివృద్ధి పదేండ్ల వెనకి వెళ్లింది. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాటపట్టింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి వచ్చింది.. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అని పాటలు పాడుకుంటున్న పరిస్థితి తలెత్తింది’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.‘కేసీఆర్ పదేండ్ల్లకాలంలో అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవు. మీరు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు రేవంత్‌రెడ్డీ.. సక్సెస్‌ఫుల్‌గా ప్రజలను మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలి’ అని ఎద్దేవాచేశారు.
ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని అని ప్రజాకవి కాళోజీ నినదించినట్టు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డరు. రైతులు దారుణంగా మోసపోయిండ్రు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అపజయాలను కప్పిపుచ్చుకొనేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. ఏం సాధించారని సంబురాలు జరుపుకొంటున్నరు రేవంత్‌రెడ్డీ?
– హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డీ.. మీరు చెప్పిన ఏడో హామీయేనా ప్రజాపాలన? కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన? ఇప్పుడు మీ పాలనలో అవి లేకుండా ఒక్కరోజూ కూడా గడవడం లేదు’ అని ఎద్దేవా చేశారు. ‘లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఇంకెంతమందిని అడ్డుకుంటరు? అక్రమ కేసులు పెడుతూ ఇంకెంతమంది నోర్లు మూయిస్తరు?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
– హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డీ.. నువ్వు కేసీఆర్.. కేసీఆర్.. అని కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి నీకు జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంట వచ్చిన అని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులనే తొక్కినవు. షార్ట్ కట్లో సీఎం అయ్యి ప్రజలను తొక్కుతున్నవు.
– హరీశ్‌రావు
‘రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది కావొస్తున్నది, ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు కండ్లు తెరవండి.. అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండి. గోబెల్స్ ప్రచారాలు పకనబెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయండి. మీ వైఫల్యాలను గుర్తించి మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పండి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.
నిజనిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని హరీశ్‌రావు ఆక్షేపించారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఇతర మహిళా సభ్యులపై సర్కారు నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అధికారం ఉన్నదని రేవంత్‌రెడ్డి ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను కూడా నిర్బంధిస్తున్నడు. నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నడు’ అని దునుమాడారు.
సెప్టెబంర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు ప్రకటించిన కాళోజీ పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయని హరీశ్ పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి నాడు సాహితీవేత్తలకు పురస్కారమిచ్చి గౌరవించుకొనే సంప్రదాయాన్ని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘ఇది ఒక్క నలిమెల భాస్కర్‌కు జరిగిన అవమానం కాదు..తెలంగాణ కవులందరికీ జరిగిన అవమానం’ అంటూ దుమ్మెత్తిపోశారు.
పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు.. సాలర్ షిప్పుల కోసం విద్యార్థులు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు.. రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు.. జీతాల కోసం ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు.. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు.. నిధుల విడుదల కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది.. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు.. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు.. ఏక్ పోలీసింగ్ కోసం పోలీసులు.. పింఛన్నల కోసం వృద్ధులు.. ఇలా పిల్లల నుంచి వృద్ధులదాకా అందర్నీ సక్సెస్‌ఫుల్‌గా రోడ్ల మీదికి తెచ్చినందుకా విజయోత్సవాలు?
-హరీశ్‌రావు