1. ఎఫ్ఆర్బీఎం అప్పు రూ. 3,89,673 కోట్లు
2. కార్పొరేషన్ అప్పులు రూ. 1,27,208 కోట్లు
3. ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు, చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు రూ. 95 వేల కోట్లు
4. ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వని రుణాలు, చెల్లించాల్సిన అవసరం లేనివి రూ. 59 వేల కోట్లు మొత్తం అప్పు 6.71 లక్షల కోట్లు
5. ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని అప్పు మొత్తం రూ. 1,54,876 కోట్లు (3+4)
6. బీఆర్ఎస్ తీసుకోని అప్పు రూ. 99,385 కోట్లు *మొత్తం అప్పు రూ. 4.17 లక్షల కోట్లు
Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని, ఎవరైనా మళ్లీ రూ.7 లక్షల కోట్లు అని అంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 డిసెంబర్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు చేసిన అప్పు రూ.15,118 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల ఖాతాలో వేశారని మరోసారి స్పష్టంచేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. అప్పులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేసి తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అప్పు బీఆర్ఎస్ ఖాతాలో వేస్తారా? ‘ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పు చేసినట్టు చూపించారు. ఇది పూర్తిగా తప్పు. భట్టి విక్రమార్క తన మేధస్సుతో ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా బీఆర్ఎస్ ఖాతాలో జమచేశారు. 7 డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ, మార్చి వరకు కాంగ్రెస్ చేసిన రూ.15,118 కోట్ల అప్పును కూడా కలిపి బీఆర్ఎస్ ఖాతాలో వేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన రూ.72,658 కోట్లను కూడా మా ఖాతాలోనే కలిపారు. 2014 కంటే ముందు గ్యారెంటీల పేరు మీద వారసత్వంగా వచ్చిన అప్పు రూ.11,609 కోట్లు బీఆర్ఎస్ ఖాతాలోనే వేశారు. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని రూ.99,385 కోట్ల అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.40 వేల కోట్లు అదనంగా అప్పుల భారం పడింది’ అని వివరించారు. భట్టి విక్రమార్క చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదించిన రూ.6.71 లక్షల కోట్ల అప్పులో బీఆర్ఎస్ చేయని అప్పు రూ.99,385 కోట్లు, ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు రూ.1.54 లక్షల కోట్లు తీసేస్తే.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు.
ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసినట్టు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిజం ఒప్పుకొన్నారని హరీశ్‌రావు చెప్పారు. మొదటి ఏడాదే అంత అప్పు చేశారంటే.. ఐదేండ్లలో రూ.6.38 లక్షల కోట్ల అప్పు అవుతుందని పేర్కొన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెరిగితే ఐదేండ్లలో కాంగ్రెస్ అప్పు రూ.7 లక్షల కోట్లకు చేరుతుందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ.4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లలోనే రూ.7 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్టు తెలిపారు. ఈ లెక్కన ఎవరు ఎక్కువ అప్పు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చిందంటూ భట్టి ఆరోపణలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014లో రెవెన్యూ మిగులు రూ.369 కోట్లు కాగా, 2023-24 బడ్జెట్లో రూ.1,704 కోట్ల మిగులు బడ్జెట్ అంటూ ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలను గుర్తుచేశారు. నాడు రూ.369 కోట్ల మిగుల్ బడ్జెట్‌తో బీఆర్ఎస్కు ప్రభుత్వాన్ని అప్పగిస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రూ.1,700 కోట్ల మిగులు బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించిందని తెలిపారు. తాము కూడా రెవెన్యూ సర్ప్లస్ గానే ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పినట్టు స్పష్టంచేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూ.68 వేల కోట్లు ఉండగా.. దశ,దిశ లేని రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రూ.2.93 లక్షల కోట్ల బడ్జెట్‌తో కాంగ్రెస్‌కు అప్పగించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఈ క్రింది గణాంకాలు వివరించారు.
రైతులకు బీఆర్ఎస్ ఏం చేసిందంటూ భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రైతాంగానికి మొత్తం రూ.4,08,902 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. దాని ఫలితంగానే రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయరంగానికి చేసిన వ్యయాన్ని గణాంకాలతో వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తాము కడుతున్నామంటూ భట్టి విక్రమార చెప్పడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పులను చెల్లించిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రూ.3 లక్షల కోట్ల అప్పులు, మిత్తీలను చెల్లించిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా అప్పుల పేరు చెప్పి, ఇచ్చిన హామీలను తాము ఎగ్గొట్లలేదని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ నమ్మించారని, కానీ 365 రోజులు గడిచినాహామీలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే. ఇందులో ఏమైనా తప్పు ఉంటే, ఈ సభలోనే మంత్రి భట్టి విక్రమార్క చెప్పాలి. ఈ రోజు తర్వాత ఎప్పుడైనా, ఎవరైనా మళ్లీ బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లు అని అంటే వారిపై తమ పార్టీ కోర్టుకు వెళ్లడంతోపాటు లీగల్ నోటీస్ ఇచ్చి శాసనసభలో ప్రివిలేజ్‌మోషన్ ఇస్తాం.
-అసెంబ్లీలో హరీశ్‌రావు
హరీశ్‌రావు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యుల్లో ఒకరు హరీశ్‌రావును ఉద్దేశించి ‘దొంగ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘దొంగ అన్నది ఎవడా యూజ్లెస్ ఫెలో’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ.. తనను దొంగ అన్నవారినే యూజ్లెస్ ఫెలో అన్నట్టు వివరించారు.
బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని శాసనసభ వేదికగా సమర్థంగా తిప్పికొట్టిన హరీశ్‌రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సంజయ్, మల్లారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు. హరీశ్‌రావు ప్రసంగం ముగియగానే ఆయన దగ్గరికి వచ్చిన కేటీఆర్.. హరీశ్‌ను అలింగనం చేసుకొని భుజం తట్టారు.
ప్రభుత్వ పాలనపై ప్రశ్నిస్తే దబాయింపులు, కేసుల పేరతో వేధించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఇమేజ్ను పెంచేందుకు కేటీఆర్ పారదర్శంగా ఫార్ములా కార్ రేసింగ్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టంచేశారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పేది నిజమైతే శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సభలో తాము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మంత్రులు డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్న మాటలు మీకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ధనయజ్ఞం.. ఈరోజు జలయజ్ఞం అయిందా ? అని నిలదీశారు.
ప్రభుత్వ ఆస్తులు అమ్మడం లేదంటూ ఆర్ధికమంత్రి భట్టి విక్రమార అబద్ధాలు చెప్తున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. 26 జూన్ 2024 రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని ఎకరా రూ.75 కోట్ల చొప్పున రూ.30 వేల కోట్లకు ఈ ప్రభుత్వం అమ్మిందని, ఇందుకు సంబంధించి జీవో 54ను విడుదల చేసిందని వివరించారు. ఇదే భూమిపై టీజీఐఐసీ రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నదని చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ, ఆ భూములను విక్రయించలేదని, పరిశ్రమల కోసం టీజీఐఐసీకి ఇచ్చినట్టు వివరించారు. మంత్రుల స్పందనపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీఐఐసీకి ఉచితంగా భూములు ఇచ్చిందని, కాంగ్రెస్ కూడా అదే విధంగా ఇవ్వొచ్చు కదా? అలా కాకుండా రూ.75 కోట్లకు ఎకరం అని ఎందుకు పెటారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములను అమ్మబోదని, టీజీఐఐసీ దగ్గర కుదువ పెట్టదని, ఒక రూపాయి కూడా తీసుకోబోదని భట్టి విక్రమార చెప్పగలరా? అని నిలదీశారు.
ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించడాన్ని హరీష్‌రావు స్వాగతించారు. తాము విచారణకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, తాను విచారణ కోరినట్టుగా సీఎం రేవంత్ చెప్పడం తప్పు అని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క పదేపదే లేచి ఓఆర్ఆర్ అమ్ముకున్నారంటూ ఆరోపిస్తుంటే, అవసరమైతే ఆ ఒప్పందాన్ని రద్దు చేయండని కోరినట్టు తెలిపారు. దీనిని తప్పుదోవ పట్టించి తాను విచారణ కోరినట్టుగా ప్రచారం చేయడం, స్వయంగా సీఎం ఆఫీసు నుంచి తన కోరిక మేకు విచారణకు ఆదేశించినట్టుగా ప్రెస్‌నోట్ ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ ఒప్పందాన్ని రద్దుచేశాకే దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.