హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు లో ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వాస్తవాలు దాచిపెట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తూ రుణాలు సమీకరించారని, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు గురువారం పూర్తి ఆధారాలతో సహా సెబీ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖరాశారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకునే క్రమంలో చేసిన ఆర్థిక అవకతవకల గురించి లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ (సెంట్రల్ ఎంపవర్ కమిటీ) ఈ భూమిని అటవీ భూమిగా గుర్తించిందని తెలిపారు.
‘అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతాం’ అని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని హరీశ్‌రావు తన లేఖలో ప్రస్తావించారు. ఈ వాస్తవాలన్నింటినీ దాచిపెట్టి భూమిని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించిందని, ఇది సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. టీజీఐఐసీ వార్షిక ఆదాయం రూ.150 కోట్ల కన్నా తకువే అని, అయినా రూ.వేల కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకలకు పాల్పడటమే అని ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదని, సెబీ నియమ నిబంధనలు పాటించారన్న విషయంలోనూ స్పష్టత లేదని ఫిర్యాదు చేశారు. రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు రూ.169.83 కోట్లు బ్రోకరేజీ చెల్లించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
1. సెబీ (ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడలెంట్ అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్) రెగ్యులేషన్స్ – 2003 ప్రకారం భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరం.
2. సెబీ (ఇష్యూ అండ్ లిస్టింగ్ ఆఫ్ నాన్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్) రెగ్యులేషన్స్-2001 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీని తప్పుదారి పట్టించే ప్రయత్నం.
3. సెబీ(లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్- 2015 ప్రకారం కంపెనీల నిర్మాణ మార్పులను, ఆర్థిక వివరాలను తప్పకుండా వెల్లడించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం, టీజీఐఐసీ వెల్లడించకపోవడం నేరం.
4. సెబీ (మర్చంట్ బ్యాంకర్స్) రెగ్యులేషన్స్ -1992 ప్రకారం మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాలను వెల్లడించకపోవడం.
5. సెబీ యాక్ట్, 1992 సెక్షన్ 11(2)(i) ప్రకారం.. సెబీకి తప్పుడు సమాచారం, మోసపూరిత లావాదేవీలు చేయడం.
6. సెబీ(ఎల్‌వోడీఆర్) రెగ్యులేషన్స్- 2015 సెక్షన్ 4(2)(e) ప్రకారం పెట్టుబడిదారులకు పూర్తి, స్పష్టమైన సమాచారం అందించడం తప్పనిసరి. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వాస్తవాలను దాచిపెట్టింది.
7. కంపెనీల చట్టం (2013)సెక్షన్ 13, 14 ప్రకారం ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి సరైన విధివిధానాలు పాటించకపోవడం.
8. సెబీ చట్టం సెక్షన్ 15A, 15HA ప్రకారం ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లడించకపోవడం ఉల్లంఘనే. అని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి, అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయట పెట్టాలని సెబీకి విజ్ఞప్తి చేశారు.