Harish Rao | ఏ దేశంలో అయినా అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని.. ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒక రాష్ట్రం, జిల్లాలో పెట్టుబడి పెట్టాలంటే నేషనల్ క్రైమ్ బ్యూరోలో క్రైమ్‌రేట్ ఎంతుంది? క్రైమ్ జరిగితే ఎంత మందిని పట్టుకుంటున్నారు..? రాష్ట్రంలో ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి ? శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని చూసి పెట్టుబడులు పెడుతారన్నారు. క్రైమ్‌రేట్‌లో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎల్లో జోన్లకు వెళ్లిందని.. ఇది ఎంతో బాధాకరమైన విషయమన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదిహేనేళ్లలో తెలంగాణ ఎప్పుడు ఎల్లో జోన్లోకి వెళ్లలేదని.. దక్షిణాదిలో ఎల్లో జోన్లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో క్రైమ్‌రేట్ 23శాతం పెరిగిందని.. రేప్ కేసులు 29శాతం పెరిగాయన్నారు. దళితులు, గిరిజనులపై రేప్ కేసులు 12శాతం పెరిగాయని.. రాష్ట్రం ఎటు పోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు బెస్ట్ పోలీసులని.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి క్రైమ్ కంట్రోల్ ఎలా చేయాలని నేర్చుకునేవారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసుల వద్ద ట్రైనింగ్ తీసుకునేవారన్నారు. ఇప్పుడు ఉన్నది కూడా అదే పోలీసులేనని.. దేశానికే ట్రైనింగ్ ఇచ్చిన పోలీసులను ఈ రోజు రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటున్నాడని మండిపడ్డారు. తెలంగాణ పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి అని.. హాక్ ఐ లాంటి భద్రత సంబంధించిన యాప్ ఉండేదని.. అది మహిళలకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఈ యాప్‌ని ఇప్పుడు బంద్ చేశారని.. డయల్ 100 పూర్తిగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. మూడు నిమిషాల్లో గతంలో వచ్చిన పోలీసులు ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాలు క్రైమ్సీన్కి రావడానికి టైం పడుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నాలజీని సరిగ్గా వాడడం లేదన్నారు. క్రైమ్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు సెకండ్ టైం కూడా చాలా కీలకమని.. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉన్నప్పుడు 15వేల నూతన వాహనాలను పోలీసులకు అందించారని గుర్తు చేశారు. ప్రతినెలా పోలీసులకు పోలీస్ స్టేషన్ అలవెన్స్ అందించారని.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారన్నారు. పోలీసుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అదనంగా వేతనాలు పెంచారని.. రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ డిటెక్షన్ రేట్లో తెలంగాణ బీహార్ రాష్ట్రాన్ని దాటిందని ఆరోపించారు. తెలంగాణ బతుకుదెరువును మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా.. తెలంగాణ లోగోని మారుస్తా.. పోలీసు లోగోని మారుస్తా అని చెప్పడం తప్పా చేసిందేమీ లేదన్నారు. పోలీసు లోగోలను మార్చుడు కాదు పోలీసులకు అవసరమైన సాంకేతికతను నిధులను అందించాలని చురకలంటించారు.
రేవంత్ రెడ్డి తీరుతో రాష్ట్రంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్ ప్రభుత్వం 15 రోజుల టీఏ ఇస్తే.. రేవంత్ రెడ్డి దాన్ని ఏడు రోజులకు తగ్గించాడన్నారు. రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్స్‌కు మూడు క్వాటర్ల సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు రూ.50వేల మెయింటెనెన్స్ డబ్బులు కేసీఆర్ ప్రభుత్వం అందించేదన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని.. స్టేషన్ అలవెన్స్ విడుదల కావాలంటే కూడా సీఐ సెక్రటేరియట్లో పైరవీ చేస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతినెలా జీవితంలో రూ.300 ఆరోగ్య భద్రత కోసం పోలీసులు కడితే ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా వారికి వైద్యం అందించే అవకాశం ఉండదన్నారు. ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ కంటే అధ్వాన్నంగా మారిపోయిందన్నారు. ఆరోగ్య భద్రత కార్డుతో పోలీసులు ఆసుపత్రికి వెళ్తే బెడ్లు ఖాళీగా లేవని పంపిస్తున్నారన్నారు. ఆరోగ్య భద్రత కార్డు కింద రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎంత మంది పోలీసులకు చికిత్స అందించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ అయిన పోలీసులకు రిటైర్మెంట్ డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదని.. హోంగార్డ్‌లకు జీతం పెంచుతాం ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఇచ్చే జీతం కూడా నెల పూర్తయితే గానీ రావడం లేదన్నారు. ఎయిర్ పోలీసింగ్ తెస్తా.. నేను పోలీస్ బిడ్డను అని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పాడన్నారు. తెలంగాణ స్పెషల్ పోలీసులు ఏక్ పోలీసు విధానం అమలు చేయమని అడిగినందుకు 38 మంది పోలీసులను సస్పెండ్ చేసి పదిమందిని ఉద్యోగాలను తొలగించారన్నారు. ఏక్ పోలీస్ ఏమైంది అని పోలీసుల పక్షాన రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నానని.. తొలగించిన పోలీసులను, సస్పెండ్ చేసిన పోలీసులను తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలీసుల సరెండర్ బిల్లులు, టీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆరోగ్య భద్రత డబ్బులను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రిటైర్మెంట్ అయిన పోలీసుల డబ్బులను కూడా వెంటనే విడుదల చేయాలని.. హోంగార్డుల బేసిక్ పే పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022లో 6,429 కేసులు రిజిస్టర్ అయ్యాయన్నారు. 2024లో సంగారెడ్డిలో 7,563 కేసులు రిజిస్టర్ అయ్యాయని.. కేవలం సంగారెడ్డి జిల్లాలోనే 1000 కేసులకు పైగా పెరిగాయన్నారు. పోలీసుల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తుందా..? బీఆర్ఎస్ కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతున్నారా? సంగారెడ్డి జిల్లాలో అత్యాచారాలు 31 శాతం పెరిగాయన్నారు. 2022లో 70.. 2023లో 100 మంది మహిళలపై అత్యాచారం జరుగుతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2024లో 131 అత్యాచారాలు జరిగాయన్నారు.
మహిళలపై ఎందుకు నేరాలు పెరుగుతున్నాయని.. దొంగతనాలు 52శాతం సంగారెడ్డి జిల్లాలో జరిగాయన్నారు. 2023లో 420 ఉంటే.. 2024లో 634 దొంగతనాలు జరిగాయన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని.. హోం మంత్రిత్వ శాఖను కూడా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నాడని.. ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి వైఫల్యమేనన్నారు. గతంలో దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులు ఈ రోజు ఎందుకు విఫలమయ్యారు? రేవంత్ రెడ్డి వచ్చినంక గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నదని ఆరోపించారు. గుడుంబా గంజాయిలకు అడ్డగా మారిందని.. గంజాయి విషయంలో సంగారెడ్డిలో 2023లో 11 కేసులు ఉంటే సంగారెడ్డిలో ఈరోజు 34 కేసులు అయ్యాయన్నారు. ఈ లెక్కలు సంగారెడ్డి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన లెక్కలేనని.. తెలంగాణలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.