హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా పండుగలు వస్తే చాలు.. చార్జీల పేరుతో దండుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఆర్టీసీ బస్సు చార్జీలు అడ్డగోలుగా పెంచి, ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుండటం సిగ్గుచేటని శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. పల్లెవెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీలు విపరీతంగా పెంచి, బతుకమ్మ, దసరా పండుగుల సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రత్యేక సర్వీసుల పేరుతో సాధారణ టికెట్ చార్జీలపై 50% అదనపు దోపిడీ ప్రయాణికులకు పెనుభారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చార్జీల మోత ప్రజలకు పండుగల సంబురం కూడా లేకుండా చేస్తున్నదని, దీనికి కాంగ్రెస్ సర్కారే కారణమని మండిపడ్డారు. పండుగల సమయంలో.. ఆర్టీసీ బస్సులు పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే ‘పండుగ స్పెషల్’ అని బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికి ప్రజాపీడనే అవుతుందని స్పష్టంచేశారు. ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజాపాలనా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి? అని ప్రశ్నించారు.
పండగ వేళ.. చీకట్లో గ్రామాలు
కాంగ్రెస్ సర్కార్ గ్రామీణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో గ్రామ పాలనా వ్యవస్థను బలోపేతం చేస్తే, కాంగ్రెస్ పాలనలో అది కుప్పకూలిపోయిందని విమర్శించారు. బతుకమ్మ పండుగ పూట కూడా వీధిదీపాల బల్బులు వెలగడం లేదని, గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రహదారులు, డ్రైనేజీల మరమ్మతుల విషయంలో కూడా కాంగ్రెస్ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లకు డీజిల్ పోయించుకొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో అవి మూలనపడ్డాయని దుయ్యబట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లేరని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడమేనని అన్నారు.
బతుకమ్మపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
తెలంగాణ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. పండుగ ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులను విడుదల చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో కంటే ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ.. పాలన గాలికి వదిలేశారని విమర్శించారు.
అద్భుతం.. అమోఘం.. ఇది కదా అసలైన మార్పు!
‘రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, ఆమోఘం.. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం. ఇది కదా.. అసలైన మార్పంటే’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్స్ వేశారు. ‘మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ వరకు మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.84,000 కోట్లు అయితే, జస్ట్ తమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి అయ్యే ఖర్చు రూ.35,000 కోట్లు అవుతాయట! కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందివ్వాలనేది లక్ష్యం కాగా, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరు అందిస్తారట. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీలు అయితే, ప్రాణహిత-చేవెళ్లలో 80 టీఎంసీలు మాత్రమే అవుతుందట’ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట అని శుక్రవారం ఎక్స్ వేదికగా దెప్పిపొడిచారు.