హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులు పచ్చని పంట పొలాలు, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్నా.. సర్కారు పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ బాధితులకు తగిన పరిహారం ఇస్తామని భువనగిరి సభలో ప్రియాంకగాంధీతో హామీ ఇప్పించిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులు హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేస్తూ, భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారని వాపోయారు. 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ పరిహారమిచ్చి భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలపై అసెంబ్లీలో నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బాధితులకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల హామీని నెరవెర్చేదాకా బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అసెంబ్లీలో పోరాడుతుందని అభయమిచ్చారు.
ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్, రాజగోపాల్‌రెడ్డిపై ఉన్నదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులు 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవడం, చౌటుప్పల్ వద్ద 78 ఎకరాల్లో ఉన్న రింగ్‌రోడ్డును అలైన్మెంట్ మార్చి 184 ఎకరాలకు పెంచడంతో మున్సిపాలిటీ రెండుగా విడిపోతున్నదని చెప్పారు. దీంతో రైతులు రెండు పంటలు పండే బంగారు భూములు, విలువైన ఇండ్లు, ప్లాట్లు కోల్పోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎంపీగా ఉన్న సందర్భంలో బాధితులతో కలిసి ధర్నాలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు పోలీసు బలగాల మధ్య నిర్బంధంగా సర్వే చేయించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఏమార్చడం, మోసం చేయడం కాంగ్రెస్ నేతలకు వెన్నతోపెట్టిన విద్య అని దుయ్యబట్టారు. ఇదే తరహాలో ఫార్మాసిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట పచ్చని పొలాల మధ్య చిచ్చుపెట్టి లగచర్ల గిరిజన బిడ్డలను జైలుపాలు చేసిన పాపం కాంగ్రెస్‌దేనని విమర్శించారు ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇప్పటికైనా కండ్లు తెరిచి ట్రిపుల్ ఆర్ రైతులను మభ్యపెట్టడం మానేసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని స్పష్టంచేశారు.
నాలుగు వేల పింఛన్‌ను ఆరు వేలకు పెంచుతామంటూ దివ్యాంగులను సైతం కాంగ్రెస్ మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. దివ్యాంగులు వారి కుటుంబాలకు భారం కావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ రూ.4వేల పింఛన్ ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడంతోపాటు విద్య, ఉద్యోగావకాశాలు కల్పించారని చెప్పారు.
కానీ, వారికి అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏడాది పూర్తయినా ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. శనివారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 26న నిర్వహించనున్న మహాధర్నాకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా వారికి హరీశ్‌రావు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.