హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ): ‘ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటది..ప్రభుత్వం దిగిరాకుంటే పార్టీ తరఫున పోరాడుతం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు హరీశ్‌రావును మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులెవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ఉత్తరం దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ భువనగిరి సభలో ప్రియాంకతో ఇప్పించిన హామీని కూడా విస్మరించడం బాధాకరమని చెప్పారు.
ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్, రాజగోపాల్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరు ‘ఓడ దాటేదాకా ఓడ మల్లన్న..ఓడ దాటినంక బోడ మల్లన్న’ చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన 40 కిలోమీటర్లకు బదులు 28 కిలోమీటర్లతో జంక్షన్ ఏర్పాటు చేయడం, 78 ఎకరాల్లో ఉన్న జంక్షన్ రింగురోడ్డును 184 ఎకరాలకు పెంచడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
మున్సిపాలిటీ రెండుగా చీలిపోతుందని చెప్పారు. రైతులు రెండు పంటలు పండే భూములు, విలువైన ప్లాట్లు కోల్పోవాల్సి వస్తుందని వాపోయారు. బాధితులకు ప్రభుత్వం తక్కువ పరిహారం ఇస్తున్నదని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారని గుర్తుచేశారు. కానీ అధికారం రాగానే అదే రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
‘కోమటిరెడ్డికి కొంతకాలంగా మతిమరుపు ఎక్కువైనట్టున్నది..ఆయన ఇచ్చిన హామీల వీడియోలు పంపుతున్నా..చూసుకోండి’ అంటూ చురకలంటించారు. ‘కోమటిరెడ్డి.. ఇప్పటికైనా స్పందించు..ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పించి నల్లగొండ వాసులకు న్యాయం చేస్తావా? లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోదల్చుకున్నావా? తేల్చుకోవాలని సూచించారు.
దక్షిణాన ట్రిపుల్ ఆర్కు ఏ విధంగానైతే 40 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకున్నారో, ఉత్తర దిక్కున కూడా 40 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్, ఇప్పుడు పోలీసు బలగాల మధ్య సర్వే చేయించి బాధిత రైతులతో దుర్మార్గంగా ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టించారని ధ్వజమెత్తారు.
‘ఎన్నికల ముందు ఓ మాట? ఎధికారంలోకి వచ్చాక మరో మాటనా? ఇదెక్కడి న్యాయం’ అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ విషయంలోనూ ఇదేవిధంగా మాట మార్చారని విమర్శించారు. ‘మాట మార్చడమే మీ విధానామా? మభ్యపెట్టడమే కాంగ్రెస్ పద్ధతా?’ అని నిలదీశారు. పరిహారం ఇవ్వాలని ప్రశ్నించిన ట్రిపుల్ ఆర్ బాధిత రైతులపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నదని చెప్పారు. ప్రియాంక గాంధీ చొరవ చూపి ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యలు పరిష్కరించేలా సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డికి ఆదేశాలివ్వాలని హరీశ్ విజ్ఞప్తిచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరిచి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.