రేవంత్‌ది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజాకంటక ప్రభుత్వం.. సింగరేణి కార్మికులను గోసపెట్టుకునే.. మానవత్వం లేని ప్రభుత్వం. అధికారంలోకి వస్తే నెలకు రెండుసార్లు మెడికల్‌బోర్డు పెడతాం.. మారుపేర్లతో పనిచేస్తున్న వారికి న్యాయం చేస్తామని హామీలిచ్చి రెండేండ్లల్లో కేవలం రెండు సార్లే మెడికల్ బోర్డు పెట్టి చేతులు దులుపుకొన్నది. కాళ్లు లేనివాళ్లు, కండ్లు కనిపించని వాళ్లు, బైపాస్ సర్జరీ అయిన వారిని కూడా ఉద్యోగం చేయాలని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం? -హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ): సింగరేణిలో అన్‌ఫిట్ కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలివ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తక్షణమే మెడికల్‌బోర్డు నిర్వహించి, ఆన్ఫిట్ కార్మికుల వారసులకు న్యాయం చేయాలని, లేదంటే వేలాదిమంది కార్మికులతో ప్రజాభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, టీజీజీకేఎస్ నేతలు, కార్మికులతో కలిసి సింగరేణి సంస్థ డైరెక్టర్ గౌతం పొట్రును కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ సర్కారు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. చంద్రబాబు రద్దు చేసిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని గుర్తుచేశారు. కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడున్న 40 వేల మంది ఉద్యోగుల్లో 20 వేల మంది డిపెండెంట్ ఉద్యోగులేనని చెప్పారు. ఉద్యోగులు, సంస్థను కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని గుర్తుచేశారు.
కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ పగ
సింగరేణి కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ పగబట్టిందని హరీశ్ విమర్శించారు. అధికారంలోకి వస్తే నెలకు రెండుసార్లు మెడికల్‌బోర్డు పెడుతామని, మారుపేర్లతో పనిచేస్తున్న వారికి న్యాయం చేస్తామని అనేక హామీలిచ్చి రెండేండ్లల్లో కేవలం రెండుసార్లే మెడికల్‌బోర్డు పెట్టి చేతులు దులుపుకొన్నదని ధ్వజమెత్తారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉ ద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చే శారు. అలసత్వం వహిస్తే ఉద్యమానికి శ్రీకారం చుడుతామని తేల్చిచెప్పారు.
రేవంత్ సోకులకు సింగరేణి డబ్బులు
రేవంత్‌రెడ్డి సర్కారు ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ఖర్చుచేసిన రూ.110 కోట్లపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని హరీశ్ ప్రకటించారు. కారకులను వదిలిపెట్టబోమని, బొక్కలేస్తామని హెచ్చరించారు. ‘రేవంత్‌రెడ్డి సోకుల కోసం సింగరేణికి చెందిన రూ.10 కోట్లు ఎలా ఖర్చు చేసిండ్రు? ముఖ్యమంత్రీ.. ఇదేమన్నా నీ అయ్య సొమ్మా?’ అంటూ నిలదీశారు. రేవంత్ పాలనలో సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. విద్యు త్తు తీసుకొని ట్రాన్స్‌కో, బొగ్గు తీసుకొని టీజీ జెన్కోలు సింగరేణికి బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. ఫలితంగా సింగరేణి అప్పుల పాలై డబ్బుల్లేక, ఓవర్ డ్రాఫ్ట్ / ఓడీ తీసుకొని జీతాలిచ్చే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, బడితెల సమ్మయ్య, అవినాశ్‌రెడ్డి, అన్వేశ్‌రెడ్డి ఉన్నారు.