Harish Rao | ఒకటో తేదీన రావాల్సిన జీతాలు.. 8వ తేదీ వచ్చినా ఇవ్వకపోవడం దుర్మార్గమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట కలెక్టరేట్‌కు వచ్చిన ఆశావర్కర్లు.. ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఒకటో తేదీన రావాల్సిన జీతాలు ఎనిమిదో తేదీ అయినా రాలేదని, పండుగ పూట జీతాలు ఎప్పుడు వస్తాయా అని వేచి చూస్తున్నామని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన సమయంలో ఇబ్బందులు పడుతున్నాం’ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, సీఎం సీటులో కూర్చున్న తర్వాత ఆ మాటలన్నీ మరిచిపోయారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగ పూట ఆశవర్కర్లకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో, సంక్షేమంలో తమవంతు కృషి చేస్తున్న ఆశవర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు. అందరూ దసరా పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటుంటే, ఆశవర్కర్ల కుటుంబాల్లో ఆవేదనను నింపడం సరికాదన్నారు. పండుగ పూట ఆడబిడ్డలను కంటతడి పెట్టించకుండా.. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.