హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల పాలిట అభయహస్తం కాదని, భస్మాసుర హస్తమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగులమందు తాగిన ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్రావు) దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించిందని, కానీ దురదృష్టవశాత్తూ నాగయ్య ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెప్తూ పురుగుల మందు తాగి, దవాఖాన పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణమని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించిందని హరీశ్‌రావు మండిపడ్డారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కారు ఏం చేసిందని ప్రశ్నించారు. ‘రోడ్డునపడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిషారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హకుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలకు పాల్పడవద్దు’ అని రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు సూచించారు.
విద్యార్థులకు సరైన భోజనం కూడా అందించలేరా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు కడిగిపారేశారు. తమ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని తల్లిదండ్రులు రోడ్డెక్కాల్సిన దుస్థితి సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే చోటుచేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని తీరు ఎలా ఉన్నదో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుంది’ అని గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన వార్త క్లిప్‌ను ట్వీట్‌కు జతచేశారు.
కేంద్ర సెస్‌లు, సర్ చార్జీల పెరుగుదలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. 2013-14లో కేంద్ర సెస్‌లు, సర్ చార్జీలు రూ.1.08 లక్షల కోట్లు అని, అది ప్రస్తుతం రూ.5.56 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. స్థూల పన్ను ఆదాయంలో ఇది 6.53 శాతం నుంచి 10.97 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. కేంద్రం వైఖరితో రాష్ర్టాలకు ఆదాయం గణనీయంగా తగ్గుతున్నదని పేర్కొన్నారు. రాష్ర్టాల హక్కుల పరిరక్షణకు సెస్‌లు, సర్ ఛార్జీలపై కేంద్రం పునఃసమీక్షించాలని కోరారు.