హైదరాబాద్, అక్టోబరు 15 (నమస్తే తెలంగాణ): పోలీస్ కానిస్టేబుళ్లకు పాత విధానంలోనే సెలవులు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లను వారాలపాటు కుటుంబాలకు దూరం చేయాలనుకోవడం సరికాదని మంగళవారం ఎక్స్ వేదికగా కోరా రు. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మ్యానువల్ మార్చడం దుర్మార్గమని, ఈ నూతన విధానా న్ని వెనక్కి తీసుకొని, ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారికిచ్చిన దసరా, దీపావళి కానుకా ఇది.. అంటూ ఎద్దేవా చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల శ్రమదోపిడీ గురించి ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి, సీఎం అయ్యాక ఊసరవెల్లిలా మారి శ్రమదోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.పెండింగ్‌లో ఉన్న టీఏ, ఎస్ఎల్, జీపీఎఫ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పెండింగ్ డబ్బు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలనూ వెంటనే విడుదల చేయాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం పోలీస్‌స్టేషన్ నిర్వహణకు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు రూ.25 వేలు, పట్టణ స్టేషన్‌కు రూ.50 వేలు, హైదరాబాద్‌లో అయితే రూ.75 వేలు ఇచ్చేదని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్‌స్టేషన్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేయడమే మరిచిందని విమర్శించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పోలీస్స్టేషన్ల నిర్వహణ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.