హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనేందుకు వేతనాలు అందక టీ వీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) రె గ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకైతే నెలల తరబడి వేతనాలు అందని దుస్థితి దాపురించిందని మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
బస్తీ దవాఖాన వైద్య సిబ్బందికి ఆరు నెలలుగా వేతనా లు పెండింగ్ పెట్టి రేవంత్‌రెడ్డి సర్కారు చుకలు చూపిస్తున్నదని ధ్వజమెత్తారు. వైద్యులు, ఇతర సిబ్బందికి బతుకమ్మ, దసరా సంబురం లేకుండా చేసి, వారిని మానసిక క్షోభకు గురిచేయడం తగునా? అని ప్రశ్నించారు. ‘పథకాల్లో కోతలు.. ప్రభుత్వ ఉ ద్యోగులకు వాతలు. మాటల్లో ఫేకుడు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు. ఇదే కదా రేవంత్‌రెడ్డి 22 నెలల్లో మీరు చేసింది. మీ పాలన అన్నివర్గాలకు శాపంగా మారింది. జీతాలు ఇవ్వకుండా 13 వేల మంది వైద్య సిబ్బందికి దసరా పండుగ దూరం చేశావు. కనీసం ఇప్పుడైనా జీతాలు ఇచ్చి వారికి దీపావళి సంబురాన్ని అందించు’ అని హరీశ్‌రావు చురకలంటించారు.