హనుమకొండ, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయని.. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేసి అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి సరార్ నడుపుతున్నారా? లేక సరస్ నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట గురువారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేపట్టిన మహాధర్నాకు హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఠంచన్‌గా ఇవ్వాల్సిన డీఏలను పెండింగ్‌లో పెట్టడం దారుణమని అన్నారు.
దేశంలో ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న వైద్య సేవల పథకం (ఈహెచ్ఎస్) సైతం ఉత్తుత్తిదేనని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల జీతాల్లో డబ్బులు కట్ చేస్తూ దవాఖానలతో అగ్రిమెంట్ లేకుండా ఈహెచ్ఎస్ పేరిట మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు హక్కుగా దక్కాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో 15 శాతం కమీషన్ అడుగుతున్న దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగులు గౌరవంతో ఉండేవారని, ఇప్పుడు సచివాలయంలోకి అనుమతి కోసం తిప్పలు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని డిమాం డ్ చేశారు.
‘సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ లోకి మారుస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గొప్పగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు దగ్గరపడుతున్నా రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదు. ప్రభుత్వంలో కనీస చలనం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఒక శాతం కాంట్రిబ్యూషన్తో ఈహెచ్ఎస్ తీసుకువచ్చినం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని 1.5 శాతానికి పెంచింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరికీ కట్ చేస్తున్నరు. ఇంట్లో రిటైరైన తల్లిదండ్రులుంటే వాళ్లకూ కట్ చేస్తున్నరు. ఇన్ని రకాలుగా కోతలు పెడుతున్నప్పటికీ ఈహెచ్ఎస్ మాత్రం అమలు కావడం లేదు. సిద్దిపేటలో రిటైర్డ్ హెడ్మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ తండ్రికి గుండెపోటు వస్తే ఏ దవాఖానకు వెళ్లినా ఈహెచ్ఎస్ లేదని వెనకి పంపిన్రు. ప్రైవేట్ దవాఖానలో రూ.11 లక్షల బిల్లు అయితే స్వయంగా యాజమాన్యాన్ని బతిమలాడి రెండు,మూడు లక్షలు తగ్గించాల్సి వచ్చింది. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి ఉద్యోగులు మోసపోవడం తప్ప వారికి ఒరిగేదేమీ లేదు. నేను స్వయంగా దవాఖానల యాజమాన్యాలతో మాట్లాడాను.
ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయడం లేదని అడిగితే.. ప్రభుత్వంతో మాకు ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ కాలేదు. ఆరోగ్యశ్రీ బిల్లులే కుప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్న ధరలు మాకు గిట్టుబాటు కావు. అందుకు మేం సిద్ధంగా లేము. కనీసం దవాఖానలతో అగ్రిమెంట్ చేసుకోకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి ఏ హకుతో డబ్బులు కట్ చేస్తున్నది? నేడు ప్రభుత్వ ఉద్యోగుల, పోలీసుల ఆరోగ్య భద్రత గాలిలో దీపంలా మారింది. ఈహెచ్ఎస్ అమల్లో ఎందుకింత జాప్యం జరుగుతుందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని కలిసి దండం పెట్టి అడిగినా ఈ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15 శాతం కమీషన్ లంచంగా అడుగుతున్నారని ఓ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయి’ అని హరీశ్‌రావు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉన్నదని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు ఏకంగా 73 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించిందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నేను ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసినప్పుడు ఉద్యోగ సంఘాలు ఎప్పుడంటే అప్పుడు వచ్చి కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్లాలంటే పోలీసు బందోబస్తు, సెక్యూరిటీ చెకింగ్లు దాటుకుని వెళ్లాలి. జీపీఎఫ్ లోన్ కోసం వెళ్దామంటే కనీసం వినే నాథుడే లేడు. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేసి, అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడు’ అని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.