బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 6: గత తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 1,900 లైంగికదాడి ఘటనలు, 2,600 హత్యలు జరిగాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. 260 స్మగుల్డ్ మారణాయుధాలు లభించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటోడ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను మాజీ మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి శుక్రవారం పరామర్శించారు.
బాధిత మహిళ కుటుంబ సభ్యులతో వారు మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతున్నదని, బీహార్ తరహాలో దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో ఫెయిలైందని, శాంతిభద్రతలు గాడి తప్పాయని విమర్శించారు. గత కేసీఆర్ పాలనలో తెలంగాణను శాంతి భద్రతలకు సేఫెస్ట్ అండ్ బెస్ట్ స్టేట్‌గా మంచిపేరు వచ్చిందని గుర్తు చేశారు.
నిరుపేద ఆదివాసీ మహిళపై పాశవికంగా దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. భూపాలపల్లిలో కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగికదాడి, ఇటీవల నాగర్ కర్నూల్లో జరిగిన సంఘటన వరకు అనేక ఘటనలు నిత్యం జరుగుతూ వస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలకులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని, జైనూరు లాంటి ఘటనలతో రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతున్నదని ధ్వజమెత్తారు.
గిరిజన ఆడబిడ్దపై జరిగిన దారుణమైన దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డికి గాంధీ దవాఖానకు వచ్చి లైంగికదాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళను పరామర్శించే సమయమే దొరకడం లేదా? అని ప్రశ్నించారు. హోం, గిరిజన శాఖ ఆయన వద్దే ఉన్నా ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కొత్త డీజీపీ వచ్చిన 2నెలల్లోనే రాష్ట్రంలో నాలుగు మత కలహాలు జరిగాయని, మెదక్‌లో సరిగాలేరన్న డీసీపీని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారని, రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ మొత్తం నాశనమైందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయల్ 100 సరిగా పనిచేయడం లేదని, పోలీసులను ప్రభుత్వం పనిచేయనీయడం లేదని చెప్పారు. ఖమ్మంలో ఎన్కౌంటర్ జరిగి 10 మంది చనిపోయారని, గత దశాబ్దకాలంలో ఒక్క బుల్లెట్ శబ్దం కూడా లేదని, ఈ ప్రభుత్వ హయాంలో ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకొని రాష్ట్రంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను వేధించడం, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, కండువాలు కప్పడంలో సీఎం బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వరద నిర్వహణ, సహాయం, రుణమాఫీ, విద్యావ్యవస్థను నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అంతకుముందు జైనూరు ఘటనపై బాధితురాలి కుమారుడు మాట్లాడారు. రాఖీ కట్టేందుకుతన తన తల్లి ఆటోలో వెళ్తుంటే అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆటోడ్రైవర్ లైంగికదాడి చేయడానికి ప్రయత్నించాడని చెప్పారు. ఆ సమయంలో తన తల్లి ప్రతిఘటించడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.
జైనూరు ఆదివాసీ మహిళపై జరిగిన దాడి లాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని మహిళా కమిషన్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. జైనూరు బాధిత మహిళను చూస్తే హృదయం ద్రవించిందని, తీవ్రమైన గాయాలతో జీవచ్ఛవంలా పడి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లాకే ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్నదని తెలిపారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు రూ.10 లక్షల వరకు ఆర్థికసాయం అందజేయవచ్చని సూచించారు.
జైనూరు ఘటనపై తక్షణ చర్యలకోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు సీఎంకు సమయం లేదని ఎద్దేవా చేశారు. కనీసం బాధితులకు న్యాయంచేసే దిశగా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదని, ఈ ప్రభుత్వానికి మహిళలంటే చులకన భావన ఉన్నదని విమర్శించారు.
రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్న చోట ఎక్కడ కూడా బాధ్యులపై శిక్షలు పడుతున్న సందర్భాలు కనిపించట్లేదని తెలిపారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకమూల ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉన్నదని, ముఖ్యమంత్రి ఇప్పటికైనా కండ్లు తెరిచి ఘటనలపై రివ్యూ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.