హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్లో ఎలుకలు కొరికి ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక కాట్లు, కుక్క కాట్లు, పాము కాట్లు, కరెంటు షాకులతో విద్యార్థులు తల్లడిల్లుతున్నా పట్టించుకోని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. రేవంత్ రెడ్డి.. మీ గురుకులాల బాట ఏమైందని ప్రశ్నించారు. ఇక నుంచి నేనే గురుకులాలను మానిటర్ చేస్తాను అన్న మాటలు ఏమయ్యాయని నిలదీశారు. కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతా అన్న మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప దాటవని విమర్శించారు. మీ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల ఇంకెంత మంది విద్యార్థులు బలి కావాలని ప్రశ్నించారు. ఎంత మంది ఆసుపత్రుల పాలు కావాలన్నారు. ప్రచారం పేరుతో తమాషా చేయడం కాదని, గురుకులాల్లో పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమస్యల వలయంలో కూరుకుపోయిన గురుకులాలపై వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.