హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయడం చేతకాక, వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్నగర్, నాగార్జునసాగర్ తరహాలో మునుగోడును అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. నియోజకవర్గ దివ్యాంగ లబ్ధిదారుల ఇంటింటి ప్రచారంలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహలపై సోమవారం మునుగోడు ఎస్కే ఫంక్షన్ హాల్లో దివ్యాంగ ప్రతినిధులతో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మంత్రి హరీశ్‌రావు, మునుగోడు నుంచి వాసుదేవరెడ్డి దాదాపు 8 వేల మంది దివ్యాంగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచార సరళి, ప్రభుత్వం దివ్యాంగులకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి వాసుదేవరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు రూ.3,016 పింఛన్‌ను ఇచ్చి ప్రభుత్వం ఆసరాగా నిలిచిందన్నారు. గత ఎన్నికల్లో మాయ మాటలతో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి.. ఆ తర్వాత నియోజకవర్గానికి ఒక్కసారైనా వచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి, రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్నగర్, నాగార్జునసాగర్ మాదిరిగానే మునుగోడును కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.