రూపాయి కూడా ఇవ్వకుండానే మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చినట్టు చెప్పి మహిళలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేసిండ్రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పరేడ్ గ్రౌండ్ సాక్షిగా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పిండ్రు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలైనా పట్టించుకుంటలేరు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సూల్ యూనిఫాంల కుట్టుకూలి రూ.50 ఇస్తే రూ.75కు పెంచినట్టు రేవంత్‌రెడ్డి మరో అబద్ధం చెప్పిండ్రు. యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలిచ్చినట్టు డబ్బా కొడుతున్నరు. అనేక మంది అధికారులను, మహిళా సంఘాలను అడిగిన. కేసీఆర్ సర్కారు ఇచ్చినట్టు రూ.50 మాత్రమే ఇచ్చిండ్రని చెప్పిండ్రు. రూ.75 ఇచ్చింది నిజమైతే ఏ ఊరిలో ఇచ్చిండ్రో చూపించు!
Harish Rao | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు భగ్గుమన్నారు. పాలన చేతగాక ప్రకృతి మీద కూడా రేవంత్‌రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎండలకు పంటలు ఎండుతున్నయట! కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు లేవా? ఎండలు ముందు పుట్టినయా? రేవంత్ ముందు పుట్టిండా?’ అని ఎద్దేవాచేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ తెచ్చిన కరువని మండిపడ్డారు. ‘ఒకవైపు ఏపీ మొత్తం నీళ్లు తీస్కపోయింది. దేవాదులలో కావల్సినన్ని నీళ్లున్నయి. మోటర్లు ఆన్ చేయలేదు. వరంగల్ జిల్లాల్లో లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతున్నది. రూ.7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్ద కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజులు మోటర్లు ఆన్ చేయలేదు. నీళ్లన్నీ కిందికి పోయినయి. కేసీఆర్ హయాంలో నీళ్లు రాంగనే మోటర్లు వేసేవారు. కాంగ్రెస్ సర్కారు కమీషన్లు కుదరక రూ.7 కోట్ల బిల్లు ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకేవి. కాల్వలు నీళ్లతో కళకళలాడేవి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ వైఫల్యం. బేలగా మాట్లాడి తప్పించుకోలేరు’ అంటూ నిప్పులు చెరిగారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.10 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. తెలంగాణభవన్‌లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు.
రూపాయి కూడా ఇవ్వకుండానే మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చినట్టు చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి మహిళలను మోసం చేశారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పరేడ్‌గ్రౌండ్ సాక్షిగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ‘నేను గత అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు మంత్రి సీతక ఇచ్చిన సమాధానం ప్రకారం.. 5 లక్షల వరకే ఎస్‌హెచ్‌జీ, స్త్రీనిధి రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణమని చెప్పారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. రూ.5 లక్షలకు మించితే తీసుకున్న రుణంపై బ్యాంకులు 12.5 శాతం చార్జ్ చేస్తున్నాయి. రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మొత్తం 21 వేల కోట్లు ఇచ్చినట్టు సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో చెప్పి మహిళలను దగా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పెంచుతమన్నరు. 15 నెలలైనా పట్టించుకోలేదు. మహిళా దినోత్సవం నాడైనా జీవో ఇస్తరనుకున్నం. కానీ, అవే అబద్ధపు మాటలు, బీఆర్ఎస్పై నిందలు తప్ప ఇచ్చిందేం లేదు. మీ అబద్ధాలు వినలేక మహిళలు వెళ్లిపోయే ప్రయత్నం చేసిండ్రు. వారు వెళ్లకుండాగేట్లకు తాళాలు వేసి నిర్బంధించిండ్రు. వడ్డీపై లెకలతోసహా శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఎంత రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణం ఇస్తారో జీవో సవరించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సూల్ యూనిఫాంల కుట్టుకూలి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50 ఇస్తే తాము రూ.75కు పెంచినట్టు రేవంత్ మరో అబద్ధం చెప్పారని హరీశ్ మండిపడ్డారు. అదే నిజమైతే ఏ ఊరిలో ఇచ్చారో చూపించాలని సవాల్ విసిరారు. ఆఖరుకు మొబైల్ ఫిష్ వ్యాన్లను కూడా తమ ఘనతగా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. పీఎం మత్స్య సంపద యోజన కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రుణం తీసుకుంటాయని, దీన్ని కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గనిపించడం లేదా? అని మండిపడ్డారు.
ప్రమాద బీమా చెకుల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద జోక్‌గా మారిందని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వయంగా సీఎం అందజేసిన చెక్కులు కూడా పాస్ కావడం లేదని మండిపడ్డారు. ‘ప్రజా పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా 2024 నవంబర్ 7న వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.35 కోట్ల చెకును మహిళా సంఘానికి సీఎం అందించారు. అది క్లియర్ కాక, 3 నెలల తర్వాత లాప్స్ అయ్యింది. దానికి ఇంకో 9 కోట్లు కలిపి, మళ్లీ నిన్న రూ.44 కోట్ల చెకును మహిళా సంఘాలకు సీఎం ఇచ్చిండ్రు. ఇప్పుడైనా చెక్ పాసైతదా? లేదంటే ఇదే డ్రామా కంటిన్యూ అయితదా? సీఎం ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఎలా? కమీషన్ లేనిదే చెక్ పాస్ కాదా ఏమిటి?’ అని చురకలంటించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం సీఎం రేవంత్‌రెడ్డి తరహా అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీశ్ విమర్శించారు. ‘భట్టి గారంటే నాకు గౌరవం. రాజకీయాల్లో కొద్దో గొప్పో విలువలు కలిగిన నాయకుడనే పేరుంది. రేవంత్‌రెడ్డి దుష్ట సావాసంతో ఇప్పుడు భట్టి కూడా చెడిపోయారు. బాడీ షేమింగ్ చేయడం, అబద్ధాలు మాట్లాడటంలో రేవంత్‌తో పోటీ పడుతున్నరు.’ అని అన్నారు.
‘పైశాచికానందం ఎవరిది రేవంత్‌రెడ్డీ?’ అని హరీశ్ నిలదీశారు. ‘హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టించి.. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి.. ఆశా వరర్లను పోలీసులతో కొట్టించి.. పేరు మర్చిపోయిండని అల్లు అర్జున్ను అరెస్టు చేయించి.. నిరుద్యోగుల వీపులు పగలగొట్టించి.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా పైశాచికానందం పొందింది నువ్వు. అధికారంతో కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నవ్’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదోమాట మంత్రులదోమాట ఉంటున్నదని, వారిలో వారికే సమన్వయం లేదని హరీశ్ విమర్శించారు. ‘గతంలో రుణమాఫీ విషయంలో సీఎం ఒక మాట అంటే, మంత్రులు మరో మాట అన్నరు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలను సలహాలివ్వాలంటున్నరు. మేం ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్తే మంత్రి ఉత్తమ్ వారికి ఎవరి సలహాలూ వద్దంటడు. ప్రమాదం జరిగి 16 రోజులవుతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు. ఒక మంత్రి చాపర్‌లో తిరిగితే, మరో మంత్రి చేపల పులుసు తింటున్నరు. ఇరిగేషన్ చీఫ్ అనిల్‌కుమార్ ఈ రోజు వరకు అకడికి పోలేదు. ఆయనకు బాధ్యత లేదా?’ అని హరీశ్ మండిపడ్డారు. ఇకనైనా అబద్ధాలు మాట్లాడకుండా పాలనపై దృష్టి పెట్టాలని, ప్రజలకు మేలు చేయాలని, సన్న వడ్లకు బోనస్ రూ.400 కోట్లను రైతులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ముందుచూపుతోనే గోదావరి జలాలు సాగర్ ఎడమ కాల్వలో తాజాగా కలిశాయని, ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతున్నదని హరీశ్ చెప్పారు. ‘కృష్ణా నది జలాలను ఏపీ తరలిస్తే, నేడు ఖమ్మం ప్రజలకు సీతారామ సాగర్ వరమైంది. కృష్ణా, గోదావరి సంగమం ఈ రోజు కేసీఆర్ వల్ల సాధ్యమైంది. ఖమ్మం రైతాంగానికి నీరు సరఫరా అవుతున్నది’ అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలు సలహాలివ్వాలని సీఎం అంటే.. ఎవరి సలహాలూ వద్దని మంత్రి ఉత్తమ్ అంటడు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 16 రోజులవుతున్నా 8 మంది ప్రాణాల గురించి ప్రభుత్వానికి పట్టిలేదు. ప్రమాద స్థలాన్ని టూరిస్టు స్పాట్ లెక మార్చిండ్రు. గ్రహణమైనా, గ్రహచారమైనా రేవంత్‌రెడ్డే! అసహనంతో రెచ్చిపోయి అబద్ధాలు మాట్లాడొద్దు. పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చెయ్యండి. కమీషన్లు మానండి.
ఈ సారి సగటు వర్షపాతం కంటే ఎకువ నమోదైంది. కృష్ణా, గోదావరి పొంగి ప్రవహించినయి. అన్ని రిజర్వాయర్లు నిండినయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ తెచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రాంగనే ఎందుకు మాయమైనయి? కేసీఆర్ నీళ్లను ఒడిసిపడితే.. రేవంత్ ఇడిశిపెట్టిండు.
‘పైశాచికానందం ఎవరిది రేవంత్‌రెడ్డీ? హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి పైశాచికానందం పొందింది నువ్వు. చిన్న పిల్లలు నీళ్ల డబ్బా, పుస్తకాలను తెచ్చుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా పైశాచికానందం పొందింది నువ్వు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి పైశాచికానందం పొందింది నువ్వు. ఆశ వరర్లను పోలీసులతో ఎగిరెగిరి కొట్టించి.. అశోశ్నగర్లో నిరుద్యోగుల వీపులు పగలగొట్టించి పైశాచికానందం పొందింది నువ్వు..
బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలిచ్చినట్టు హరీశ్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో 10 వేల కోట్లు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని భట్టివిక్రమార్క అనడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక 2022-23లోనే రూ.13 వేల కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. ‘మేం అధికారంలోకి వచ్చే నాటికి అప్పటి కాంగ్రెస్ రూ. 2 నుంచి 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం సెర్ప్, మెప్మా, స్త్రీనిధి ద్వారా మొత్తం లక్ష కోట్ల రుణాలిచ్చినం. మీకు చేతనైతే రూ.2 లక్షల కోట్ల రుణాలివ్వండి. అంతేకాని అడిగేవారు లేరనుకొని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. నేను చెప్పింది తప్పయితే అసెంబ్లీలో చర్చ పెట్టు. ఏ ఏడాది ఎంత ఇచ్చినమో లెకలతో సహా చెప్తా. నేను ఆర్థిక మంత్రిగా పని చేసిన. పచ్చి అబద్ధం మాట్లాడుతున్నవు.. ఇదేం చిల్లర రాజకీయం?’ అని హరీశ్ నిప్పులు చెరిగారు.