ఖమ్మం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖమ్మం సిటీ : రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని, ఇందుకు మంత్రి సిద్ధమా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సవాల్ విసిరారు. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ఏ గ్రామంలోనైనా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమని, 100 శాతం రైతు రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని, ఇదే విషయంపై తుమ్మల సిద్దిపేటకు వచ్చి రైతులను అడిగి నిరూపించినా రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఖమ్మం మమత కాలేజీ గ్రౌండ్లో బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన భారీ ఆత్మీయ సమ్మేళన సభలో హరీశ్ పాల్గొన్నారు.
నేతల సమక్షంలో అజయ్ బర్త్‌డే కేక్ కట్ చేశారు. అనంతరం ఆయనను అతిథులు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ‘రేవంత్ పోవాలి..కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారని, అందరి నోటా ఒకేమాట వినిపిస్తున్నదని చెప్పారు. రెండున్నరేండ్లుగా అన్నివర్గాలను బుకాయిస్తూ కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. రుణమాఫీ చేసేందుకు చేతకాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ బోగస్ మాటలని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఏపీకి మేలు చేయడానికే సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ పనులను రేవంత్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిలిపివేసిందని మండిపడ్డారు. ముగ్గురు మంత్రులు ఉండి, సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలో మక్కలు, వడ్ల కొనుగోలు చేసే దిక్కులేకుండా పోయిందని వాపోయారు. ‘జిల్లాలోని ముగ్గురు మంత్రుల్లో ఒకరు బకాసురుడు.. మరొకరు కమీషన్ల కింగ్.. ఇంకొకరికి పర్సెంటేజీల మీదే ధ్యాస’ అని దుయ్యబట్టారు.
వెలుగుమట్ల ఇండ్ల తొలగింపు ఘటనలో పోలీసులే కన్నీరు పెట్టుకున్నా ఈ జిల్లా మంత్రుల గుండె మాత్రం కరగలేదని వాపోయారు. వెలుగుమట్ల బాధితులుందరికీ ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఇసుక రీచ్‌లను కాంగ్రెస్ మాఫియా అక్రమంగా ఆక్రమించుకొని గిరిజనుల కడుపు కొడుతున్నదని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మైనింగ్ స్కామ్‌ను బయట పెడితే ప్రభుత్వం ఆగమాగమైందని, పొంగులేటి మైనింగ్‌పై ఫైన్ కట్టించామని సీఎం చెప్తే పొంగులేటి తనకు మైనింగే లేదని బుకాయించాడని, ఇక మైనింగ్ మంత్రి మాత్రం స్పెషల్ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారని చెప్పారని, ముగ్గురు కీలక నేతలు మూడు రకాలుగా మాట్లాడటంతో ప్రజలకు విషయం పూర్తిగా అర్థమైందని చెప్పారు.
తుమ్మలా.. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ఏ గ్రామంలోనైనా క్షేత్రస్థాయి పరిశీలనకు పోదాం.. 100 శాతం రైతు రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తా.. సిద్దిపేటకు వచ్చి రైతులను అడిగి నిరూపించినా రాజీనామాకు సిద్ధంగా ఉన్నా.. నువ్వు సిద్ధమా?
-హరీశ్‌రావు
‘కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను కూడా మోసం చేసిందని, కనీసం అక్రెడిటేషన్ కార్డులను సైతం ఇవ్వలేకపోయింది’ అని హరీశ్ విమర్శించారు. ‘గోదావరి నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. తెలంగాణ నుంచి నీళ్లు కిందికి పోవాలి, నల్లమల సాగర్ ముందుకు సాగాలి అనేది రేవంత్ వ్యూహంగా మారింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రయోజనం చేకూర్చేందుకు సీతమ్మ సాగర్‌ను పూర్తిచేయడం లేదని విమర్శించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఒకాయన విర్రవీగిండు. మాయమాటలు, గ్యారెంటీల పేరుతో ప్రజలను ఏమార్చి ఎన్నికల్లో గెలిచిండ్రు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదు సరికదా పేదలను రోడ్డుపాలు చేసిండ్రు. ఇప్పుడు చెప్తున్నా.. కాంగ్రెస్సోళ్లూ.. కాచుకోండ్రి.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మీలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వ.
-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
మాయమాటలు, గ్యారెంటీల పేరుతో ప్రజలను ఏమార్చి ఎన్నికల్లో గెలిచిండ్రు. ఇక్కడ ముగ్గురు మంత్రులుగా ఉన్నా ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదు సరికదా పేదలను రోడ్డుపాలు చేసిండ్రు. ఇప్పుడు చెప్తున్నా.. కాంగ్రెస్సోళ్లూ.. కాచుకోండి! 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మీలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఒంటిచేత్తో కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ఖమ్మానికి చెందిన ఓ మంత్రి అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రూ.కోటి పార్టీ విరాళం ఇచ్చినందుకు మోచేతి నీళ్లు తాగారని అనడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి అటకెక్కిందని, ప్రజా సంక్షేమం గాలిలో కలిసి కేవలం పోలీసు రాజ్యం నడుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యతన సాగిన సమ్మేళనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా , మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, రామచందర్‌రావు, రాకేశ్‌రెడ్డి, లింగాల కమల్‌రాజు, నాయకులు పాల్గొన్నారు.