సిద్దిపేట : అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని 15 వార్డ్ గాడి చెర్లపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కు లేదు, మళ్లీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలని మండిపడ్డారు. అప్పుడు అందరికి పరమాన్నం పెడుతామని ఇప్పుడు అందరికి పంగాణామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
రుణమాఫీ అయింది అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) హైదారాబాద్లో చెప్తున్నాడు. దమ్ముంటే ఇక్కడికి రా చూపెడతా అని సవాల్ విసిరారు. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకున్ని పాక్షిక రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఎంతోమంది రైతులు ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, రుణమాఫీ సగం కూడా చేయలేదన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి. నేను కూడా వస్తాను. పోలీసులను పెట్టి నిర్భందాల మధ్య గ్రామ సభలు(Village assemblies) నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఉసురు పోసుకుంటున్నారు..
రేవంత్ రెడ్డి డమ్మీ చెక్ ఇచ్చావా? రెండు నెలలు అయినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్ పాస్ కాలేదన్నారు. ఈ ప్రభుత్వానికి మోసాలు తప్పా నీతి నిజాయితీ లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. వానాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 15వేల రైతుబంధు ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతబంధు ఆపలేదని గుర్తు చేశారు. వెంటనే రైతులకు వానాకాలం, యాసంగి రైతుబంధు విడుదల చేయాలన్నారు. దరఖాస్తుల పేరుతో ప్రజల ఉసురు పోసుకుంటున్నారు, వెంటనే అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒక్క హామీ నెరవేర్చలేదు..
రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చడం తప్పా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. వ్యవసాయ కూలీల అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నారు. గ్రామ సభల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తున్నాడు. ఆంధ్రాలో గెల్వగానే పెంచుతా అన్న పెన్షన్ను చంద్రబాబు పెంచి ఇచ్చాడు. రేవంత్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.