హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, పల్లెల నుంచి పట్టణాల వరకు పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మున్సిపాలిటీలు నేడు నిర్వహణ లేక కళ తప్పాయని, కనీసం వీధిలైట్లు వేయలేని, మురికి కాలువలు శుభ్రం చేయలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో ‘పట్టణ ప్రగతి’ ద్వారా మున్సిపాలిటీల రూపురేఖలే మారిపోయాయని గుర్తుచేశారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి విజయానిన్న సాధించిందని, అదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి నాడు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, నేడు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా, ప్రజల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్యరావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఇన్చార్జులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.