హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎంత పరిహారమైనా చెల్లిస్తామని భరోసా ఇచ్చినా పొరుగున మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం, ప్రాజెక్టు ప్రతిపాదిత తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత లేదని, నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సీడబ్ల్యూసీ సూచనలు చేయడం.. ఇతర సాంకేతిక కారణాల వల్లే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి (పీసీఎస్ఎస్) ప్రాజెక్టును రీ డిజైన్ చేయాల్సి వచ్చిందని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే ఆయా అంశాల పరిష్కారానికి క్యాబినెట్ సబ్‌కమిటీ, రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ ఏర్పాటయ్యాయని, ఆ కమిటీల నివేదికల ఆధారంగానే మేడిగడ్డ నుంచి నదీమార్గం ద్వారా జలాలను అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని ప్రణాళిక సిద్ధమైందని స్పష్టంచేశారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ ఎదుట నివేదించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై నాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ ఎదుట హరీశ్‌రావు సోమవారం ఉదయం 11 గంటలకు హాజరయ్యారు. హరీశ్‌ను జస్టిస్ పీసీ ఘోష్ దాదాపు 40 నిమిషాల పాటు విచారించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి ఎవరు కారణం? ఎవరు నిర్ణయించారు? నిర్మించాల్సిన ఆవశ్యకత? నిర్మాణం కోసం కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ.. తిరిగి చెల్లింపులు.. బరాజ్‌ల లొకేషన్ల మార్పు, నీటి నిల్వకు సంబంధించిన అంశాలపై దాదాపు 20 ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ హరీశ్ దీటుగా బదులిచ్చారు.
ప్రాజెక్టు రీ డిజైన్‌కు ముందు మహారాష్ట్ర సర్కారుతో చేసిన సంప్రదింపులను, సీడబ్ల్యూసీ వెల్లడించిన అభిప్రాయాలపై సాగించిన చర్చలను, ఆయా సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్‌కమిటీ, రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ అధ్యయనం చేసి ఇచ్చిన సలహాలను ఇలా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చివరివరకూ చేసిన కృషినంతటినీ జస్టిస్ ఘోష్‌కు నివేదించారు. ఎందువల్ల రీ డిజైన్ చేయాల్సి వచ్చింది? నిధుల సమీకరణకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరమేమిటి? అనే వాటిని కూలంకషంగా వివరించారు. ఆయా మీటింగ్‌ల మినిట్స్ పత్రాలు, డాక్యుమెంట్లను సైతం కమిషన్‌కు సమర్పించారు. మాజీ మంత్రి నివేదించిన అంశాలపై జస్టిస్ ఘోష్ సైతం సంతృప్తి వ్యక్తంచేశారు. హరీశ్‌రావు అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఆయా అంశాలను ఉటంకించారు.
కమిషన్ ప్రశ్నలు.. హరీశ్ సమాధానాలు..
కమిషన్: ఇరిగేషన్‌శాఖ మినిస్టర్‌గా ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారు?
హరీశ్‌రావు: 2014, జూన్ 2 నుంచి 2018, నవంబర్ వరకు
కమిషన్: జీవో 655 ద్వారా ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ పాత్ర ఏమిటి?
హరీశ్: తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో చాలా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులున్నాయి. వాటిలో అంతర్రాష్ట్ర సమస్యలు, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు, నీటి కేటాయింపుల వంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను రీ ఇంజినీరింగ్ చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి నేను చైర్మన్‌గా ఉన్నాను. ఈటల రాజేందర్, అప్పటి ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సభ్యులుగా ఉన్నారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌తోపాటు, ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను ఎలా కొనసాగించాలనే అంశంపై సబ్ కమిటీ అధ్యయనం చేసింది. విభజించేందుకు వీలులేని పనులను అవే ఏజెన్సీలతో కొనసాగించాలని, విభజించే వీలున్న పనులకు కొత్తగా టెండర్ పిలిచి ఏజెన్సీలకు అప్పగించాలనే విషయాన్ని కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. అందులో భాగంగానే డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు కాంపోనెంట్లుగా రీ ఇంజినీరింగ్ చేయాలని నిర్ణయించినం.
తొలి కాంపోనెంట్లో భాగంగా తమ్మిడిహట్టి వద్ద నిర్మించే బరాజ్ (ప్రాణహిత-చేవెళ్ల)తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లివ్వాలనుకున్నాం. ఇక, రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మొత్తం ఏడు లింకులున్నాయి. అందులో 6 లింకులను మార్చలేదు. తొలి లింక్ (తమ్మిడిహట్టి వద్ద బరాజ్)లోనే సమస్యలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్ అయిన తమ్మిడిహట్టి వద్ద కీలకమైన బరాజ్‌కు సంబంధించి లెవల్స్‌ను ఫిక్స్ చేయకుండా, అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోకుండా, బరాజ్ పనులను చేపట్టకుండానే కాలువల తవ్వకం చేపట్టింది. 2007 నుంచి 2014 వరకు కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా తమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి సాధించలేదు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటై, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ 45 రోజుల్లోనే కేసీఆర్ ఆదేశాల మేరకు సాగునీటిశాఖ మంత్రిగా ఉన్న నేను, ఇంజినీర్ల బృందంతో కలిసి మహారాష్ట్రకు వెళ్లినం. అకడ కాంగ్రెస్ సర్కారే ఉన్నది.
ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ను కలిసి ప్రాజెక్టు నిర్మాణం అవసరాన్ని వివరించినం. కానీ అప్పటికే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖను గుర్తుచేశారు. 152 మీటర్ల ఎత్తుతో చేపట్టే ప్రాజెక్టు పనులు నిరుపయోగమని ఖరాకండిగా తేల్చిచెప్పారు. 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తేనే అంగీకరిస్తామని తేల్చిచెప్పారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు రాష్ర్టాల అధికారుల మధ్య రెండుసార్లు 2014 ఆగస్టు 16, 2015 ఫిబ్రవరి 4న హైదరాబాదులో చర్చలు కొనసాగాయి. ఆనాడు దివంగత ఆర్ విద్యాసాగర్‌రావు కూడా చర్చల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ సర్కారు పోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కూడా మళ్లీ మహారాష్ట్ర సాగునీటి మంత్రి గిరీష్ మహాజన్, నేను ముంబైలో సమావేశమయ్యాం. అయితే ముఖ్యమంత్రుల స్థాయిలోనే సమస్య పరిషరించుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. దీంతో మళ్లీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సంప్రదింపులు చేపట్టాం. ఫిబ్రవరి 17న ముంబయి వెళ్లి సీఎం ఫడ్నవీస్‌తో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రాజెక్టు ఆవశ్యకతను, తెలంగాణ అవసరాలను వివరించారు. ఆ చర్చల్లో తెలంగాణ బిడ్డ, అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా ఉన్నారు.
సీఎం ఫడ్నవీస్‌ను ఒప్పించేందుకు ఆయన కూడా కృషి చేశారు. అయినా ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. 152 మీటర్లతో ప్రాజెక్టు కడితే వాటిల్లే ముంపుపై తానే విదర్భ ప్రాంత నాయకుడిగా ప్రత్యక్ష పోరాటాలు చేశానని, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని నిర్మోహమాటంగా కేసీఆర్‌కు తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రెండింటినీ ఒప్పించేందుకు చివరివరకూ ప్రయత్నించాం. కానీ మహారాష్ట్ర నేతలు తమ వైఖరి మార్చకోలేదు. అయితే సీఎం ఫడ్నవీస్ మాత్రం 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మించుకుంటే సహకరిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రతో చర్చలు కొనసాగిస్తున్న సమయంలోనే ఉమ్మడి ఏపీ సమర్పించిన ప్రాణహిత- చేవెళ్ల డీపీఆర్‌పై సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం 2015లో స్పందించింది. ప్రతిపాదిత తమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని తెలిపింఇ. అక్కడ మొత్తంగా 165 టీఎంసీల జలాలున్నా అందులో ఎగువ రాష్ర్టాలు వినియోగించుకోని 63 టీఎంసీలు ఉన్నాయని వెల్లడించింది. అంతేకాదు భవిష్యత్తులో ఎగువ రాష్ర్టాలు ప్రాజెక్టులు కట్టి జలాలను వినియోగించుకుంటే నికరంగా అందులో ఉండేది 102 టీఎంసీలేనని తేల్చిచెప్పింది. ఈ అంశాన్ని పునఃపరిశీలించి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది.
అంతేకాదు 148 మీటర్లతో బరాజ్ నిర్మిస్తే తమ్మిడిహెట్టి నుంచి కేవలం 44 టీఎంసీలు మాత్రమే మళ్లించగలరని 2016 ఫిబ్రవరిలో మరోసారి వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 165 టీఎంసీలతో ప్రతిపాదించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో ఆ మేరకు నీటినిల్వ సామర్థ్యం లేదు. కేవలం 16 టీఎంసీలే. ఆ కెపాసిటీలను పెంచుకోవాలని సీడబ్ల్యూసీనే సూచించింది. ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను కట్టాలని తెలిపింది. ఇలా మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సూచనల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వచ్చింది. సీడబ్ల్యూసీ అనుబంధ సంస్థ అయిన వ్యాప్కోస్ను ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కోరాల్సి వచ్చింది. అదేవిధంగా విశ్రాంత ఇంజినీర్లతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. తుదకు సమస్యలన్నింటికీ పరిష్కారంగా నీటిలభ్యతకు పూర్తిగా భరోసా ఉన్న మేడిగడ్డ కనిపించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలని వ్యాప్కోస్ రికమండ్ చేసింది. 2016 జులై 17న వ్యాపోస్ సంస్థ లైడార్ సర్వే చేసింది. 2017 సెప్టెంబర్ 17న సీడబ్ల్యూసీ రాసిన లేఖలో మేడిగడ్డ వద్ద 283 టీఎంసీల నీళ్లున్నాయని చెప్పింది. అన్ని రిపోర్టులపై చర్చించి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాలని నిర్ణయించాం. సీడబ్ల్యూసీ సూచనల మేరకే బరాజ్‌లు, రిజర్వాయర్ల సంఖ్య పెంచాం. క్యాబినెట్ ఆమోదించింది.
కమిషన్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ లొకేషన్ల ఎంపిక ఎవరిది?
హరీశ్: మేడిగడ్డ బరాజ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యతను సీడబ్ల్యూసీలో ఒక విభాగమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌కే అప్పగించినం. బరాజ్‌ల స్థలాలను వ్యాప్కోస్ ఎంపిక చేసింది. అందుకు కూడా ప్రత్యేక కారణం ఉన్నది. గతంలో ప్రాణహిత- చేవెళ్ల డీపీఆర్‌ను వ్యాప్కోసే రూపొందించింది. గోదావరిపై అప్పటికే అధ్యయనం చేసింది. అవగాహన ఉన్నది కాబట్టి ఆ సంస్థకే అప్పగించినం. వ్యాపోస్ సంస్థ నివేదికల ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు నిర్మించినం. మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజినీర్లు సైతం రిపోర్టులు ఇచ్చారు.
కమిషన్: బరాజ్‌ల పరిపాలనా అనుమతులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా?
హరీశ్: వ్యాపోస్ ఇచ్చిన డీపీఆర్‌లకు క్యాబినెట్ ఆమోదం ఉన్నది.
కమిషన్: మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల బరాజ్‌లు నిర్మించాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు?
హరీశ్ : 2016, జనవరి 17న వ్యాపోస్ డీపీఆర్ సమర్పించింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నం.
కమిషన్: అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్లను మార్చాలని హైపవర్ కమిటీ నిర్ణయించిందా?
హరీశ్: అది పూర్తిగా సాంకేతిక అంశం. రాజకీయ నాయకులకు దీనిపై అవగాహన ఉండదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంజినీర్లు డిసైడ్ చేస్తారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల కోసం లొకేషన్లను కాల్వ దూరం, రెండు బరాజ్‌ల మధ్య దూరం, విద్యుత్తు ఖర్చు తగ్గించేందుకు వీలుగా మార్చారు. వాటికి హైపవర్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలూ ఇచ్చింది.
కమిషన్: హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకున్నా వ్యాపోస్ సూచనలనూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా?
హరీశ్: హైపవర్ కమిటీలో వ్యాపోస్ అధికారి కూడా సభ్యులుగా ఉంటారు. హైపవర్ కమిటీ, వ్యాపోస్ కలిసి బరాజ్‌ల లొకేషన్ల మార్పునకు ఆమోదం తెలిపాయి.
కమిషన్: టెండర్లు ఖరారయ్యాక వాటిలో ఏమైనా మార్పులు చేశారా?
హరీశ్‌రావు: పరిస్థితులు, సైట్, పనుల పరిస్థితులను బట్టి డిపార్ట్మెంట్.. టెండర్ల షరతులను మార్చేందుకు అవకాశం ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ దానిపై సిఫార్సులు చేసేందుకు వీలుంటుంది.
కమిషన్: నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు?
హరీశ్‌రావు: అంత ఆలస్యమేమీ కాలేదు. ఆ కొద్దిపాటి డిలే కావడం సర్వసాధారణం.
కమిషన్: కార్పొరేషన్ రుణాలు, వడ్డీల చెల్లింపులకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగిందా?
హరీశ్‌రావు: లేదు.
కమిషన్: కార్పొరేషన్‌కు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేశారా? రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీలిచ్చిందా?
హరీశ్‌రావు: కార్పొరేషన్‌కు సరిపడా బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. కార్పొరేషన్‌కు ప్రభుత్వం పూర్తి పూచీకత్తు ఇచ్చింది.
కమిషన్: ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయంతో కార్పొరేషన్ రుణాల చెల్లింపులు చేశారా? రెవెన్యూ జనరేషన్ కోసం తీసుకున్న చర్యలేంటి?
హరీశ్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 30 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, 10 టీఎంసీలు ఎన్ రూట్ గ్రామాల మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకు, 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు.. ఇలా వివిధ వర్గాలకు విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో రుణాల చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిం చాం. కరోనా వల్ల 2 ఏండ్లు ఆలస్యమైంది. కానీ ఇప్పటికే ములుగు జిల్లాలో కోకాకోలా కంపెనీకి నీళ్లను విక్రయిస్తున్నం. ప్రాజెక్టు ఫలితంగా ఇప్పటికే పలు కంపెనీలు వచ్చినయి.
కమిషన్: బరాజ్‌లను నీళ్ల స్టోరేజీ కోసం నిర్మించారా?
హరీశ్: టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవు.
కమిషన్: కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఎన్ని నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు?
హరీశ్ : 3 బరాజ్‌లు, ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలో కలిపి 141 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. అత్యధికంగా మల్లన్నసాగర్లో 50 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చు.
కమిషన్: బరాజ్‌లలో ఎఫ్ఆర్ఎల్ మేరకు నీటిని నింపాలని ఎవరు ఆదేశించారు? ప్రభుత్వం ఏమైనా ఆదేశించిందా?
హరీశ్: ఇది టెక్నికల్ అంశం. ప్రభుత్వం నుంచి ఎవరూ ఆదేశాలివ్వలేదు.
కమిషన్ : 2016లోనే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తయ్యాక.. 2018లో భూసేకరణను ఆపేసి ఫ్లడ్ బ్యాంకులు, డ్రైనేజీ చానళ్లను నిర్మించాలనుకోవడం తప్పుడు ప్లానింగ్ కాదా?
హరీశ్: అది ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రాజె క్టు నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితుల మేరకు ఇంజినీర్లే నిర్ణయం తీసుకుంటారు.
విచారణకు తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు ; హరీశ్ వెంట ఓపెన్‌కోర్టుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. లీగల్ టీమ్‌కు ముందుగా అభ్యంతరం.. ఆపై అనుమతి
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణకు బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. విచారణకు మాజీ మంత్రి హరీశ్ హాజరైన నేపథ్యంలో గులాబీశ్రేణులు కదిలివచ్చారు. ఆయన వెంట ఓపెన్ కోర్టు హాల్‌కు మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంజయ్, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు ఉన్నారు. విచారణను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన లీగల్ టీంకు కమిషన్ ముందుగా అనుమతివ్వలేదు. పోలీసులు, కమిషన్ అధికారులు వచ్చి పర్మిషన్ లేదని వారికి చెప్పారు. కానీ లీగల్ టీం సభ్యులు బయటకు వెళ్లేందుకు అంగీకరించలేదు.
ఇది ఓపెన్ కోర్టు అని, ఎవరైనా వచ్చి ప్రొసీడింగ్స్ చూసేందుకు అవకాశం ఉంటుందని వాదించారు. ‘నల్లకోటు వేసుకొని రావడమే తప్పా? దాన్ని విప్పేసి రమ్మంటే వస్తాం’ అని వివరించారు. అనుమతి లేదని కమిషన్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలిప్పిస్తే వెళ్లిపోతామంటూ భీష్మించుకు కూర్చున్నారు. తుదకు కమిషన్ వర్గాలు బీఆర్ఎస్ లీగల్ టీమ్‌ను అనుమతించాయి. అయితే నల్లకోటును మాత్రం విప్పేయాలని సూచించాయి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవారెడ్డి, పల్లె రవికుమార్, బాలరాజుయాదవ్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దేవీ ప్రసాద్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు భారీగా బీఆర్కే భవన్‌కు తరలివచ్చారు. పోలీసులు వారిని బారికేడ్లతో బయటే ఆపేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. హరీశ్ విచారణ కొనసాగినంత సేపు వారు నినాదాలు చేశారు.
కమిషన్: బరాజ్‌ల స్థలాల ఎంపిక కోసం ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 28 గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
హరీశ్: అది టెక్నోక్రాట్ డెసిషన్స్. ప్రభుత్వ నిర్ణయం ఏముంటది? అది ఇంజినీర్ల నిర్ణయం. వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిన తర్వాత మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాలని నిర్ణయమైంది. నీటి సోర్సులను తెలుసుకునే బాధ్యతను ఎక్స్పర్ట్ కమిటీకి అప్పగించారు. టెక్నికల్ కమిటీ సూచించింది. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు అవకాశం లేదని కమిటీ చెప్పింది. రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ దానిని అంగీకరించింది. బొగ్గుగనులు, మార్గమధ్యలో అనేక పట్టణాలు ఉండటం, భూసేకరణ తదితర సాంకేతిక కారణాల నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ నుంచి నేరుగా మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు జలాలను తరలించలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో గోదావరి నదీ మార్గం గుండానే మేడిగడ్డ నుంచి జలాలను ఎల్లంపల్లి వరకు తరలించాలని నిర్ణయించారు. 3 బరాజ్‌లను ప్రతిపాదించారు.
కమిషన్: వ్యాపోస్ లెటర్ ఇచ్చాకే లొకేషన్లు మార్చారా? లేదంటే వ్యాపోస్ సూచనలకు ముందే చేశారా?
హరీశ్: వ్యాపోస్ నుంచి లెటర్ వచ్చాకే బరాజ్‌ల లొకేషన్లను మార్చా రు. ప్రాజెక్టుల లొకేషన్లను మార్చడం కొత్తేమీ కాదు. అంతకుముందు అనేక ప్రాజెక్టుల లొకేషన్లను కూడా మార్చా రు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును తొలు త ఏలేశ్వరం వద్ద ప్రతిపాదించారు. ఆ తర్వాత నందికొండకు మార్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును తొలుత కుస్తాపురం వద్ద ప్రతిపాదించారు. తర్వాత పోచంపాడుకు మార్చారు. కాంతనపల్లి వద్ద తొలుత బరాజ్ నిర్మించాలనుకున్నరు. ముంపు భారీగా ఉండటం, గిరిజనులు వ్యతిరేకించడంతో తుపాకులగూడెం వద్దకు మార్చారు. అదే ఇప్పటి సమ్మకసాగర్ బరాజ్. పనులు ప్రారంభించిన అనంతరం క్షేత్రస్థాయి అవసరాలు, సాంకేతిక అంశాల కారణంగా లొకేషన్లను మారుస్తుంటారు.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏ పర్పస్‌లో ఏర్పాటు చేశారు?
హరీశ్‌రావు: తెలంగాణ అప్పటికి కొత్త రాష్ట్రం. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. స్వరాష్ట్రంలో సాగునీళ్లు అందుతాయని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నరు. కలలు కన్నరు. అలా అనేక ఆకాంక్షలతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణ అవసరాన్ని గుర్తించినం. పెద్ద ప్రాజెక్టులు కట్టేందుకు సరిపడా నిధుల్లేవు. అందుకే నిధుల సమీకరణ కోసం క్యాబినెట్లో తీర్మానం చేశాకే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినం. రుణాలను కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ, జాతీయ బ్యాంకుల నుంచే కార్పొరేషన్ తీసుకున్నది.